అమెరికాలో కాల్పుల కలకలం
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. న్యూఓర్లీన్స్లోని లోవర్ 9 వార్డులో చోటుచేసుకున్న కాల్పులు ఇద్దరిని బలిగొన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 8 గంటలకు కాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. సెయింట్ క్లాడ్ ఎవెన్యూ 5100 బ్లాక్ సమీపంలోని పెట్రోల్ పంపు పక్కన ఆగి ఉన్న కారులో ఓ మృతదేహాన్ని గుర్తించారు. సంఘటనకు ముందు కొందరు వ్యక్తులు ఇక్కడ ఘర్షణ పడినట్టు స్థానికులు పేర్కొన్నారు. అయితే ఎందుకు ఘర్షణ పడ్డారన్న దానిపై ఇంకా సృష్టత రాలేదని అధికారులు వెల్లడించారు. దాడికి పాల్పడిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపారు. కాగా ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి ఘటనా స్థలం వద్దే మృతిచెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఇదే దాడిలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనీ, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.













