హీరో విజయ్ రాజకీయ ప్రవేశం..! ఏ పార్టీకి ఎసరు పెడుతున్నారు..?
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. నిన్నమొన్నటి వరకూ జయలలిత వర్సెస్ కరుణానిధి అన్నట్టు పాలిటిక్స్ నడిచేవి. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. కరుణానిధి లేని లోటును ఆయన కుమారుడు స్టాలిన్ భర్తీ చేస్తున్నారు. జయలలిత లేని లోటును మాత్రం ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు. అన్నాడీఎంకే పార్టీ అంతర్గత విభేదాలతో వీధిన పడింది. దీంతో తమిళనాడులో పొలిటికల్ వాక్యూమ్ కనిపిస్తోంది. దీన్ని సొమ్ము చేసుకోవాలని బీజేపీ ఓ వైపు ప్రయత్నిస్తోంది. మరోవైపు తమిళనాడులోని మరికొందరు ప్రముఖులు కూడా ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. ముఖ్యంగా హీరో విజయ్ రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడులో సినీరంగం, రాజకీయ రంగం విడదీయలేనివి. రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఎంతోమంది సినీ ప్రముఖులు అక్కడ రాజకీయాల్లోకి ప్రవేశించి రాణించారు.. రాణిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈమధ్య పార్టీ ప్రకటించి.. వయసు పైబడడం, అనారోగ్యం తదితర కారణాల వల్ల విరమించుకున్నారు. కమల్ హాసన్ పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయ్ కాంత్, శరత్ కుమార్.. తదతరులు కూడా పాలిటిక్స్ లో ఉన్నారు. ఇప్పుడు హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారనే టాక్ తమిళనాడులో బలంగా వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఆయన అధికారిక ప్రకటన చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.
విజయ్ ఇటీవల తన అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన 15 జిల్లాల అభిమాన సంఘాల నేతలను చెన్నైలోని తన కార్యాలయానికి పిలిపించుకుని సదీర్ఘంగా చర్చలు జరిపారు. గ్రౌండ్ లెవల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇది సరైన సమయమేనా.. వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి.. లాంటి అనేక అంశాలపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన జిల్లాల అభిమానులతో భేటీ అవుతారని సమాచారం. అంతకుముందు తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పది, ఇంటర్ అత్యధిక మార్కులతో పాసైన ముగ్గురు విద్యార్థులను, వాళ్ల తల్లిదండ్రులను తన కార్యాలయానికి పిలిపించుకుని వారిని సన్మానించారు విజయ్. ఆ సందర్భంగా ఆయన ఓటు విలువను, నోటు రాజకీయాలను వారికి విడమర్చి చెప్పారు. అప్పట్లే విజయ్ కామెంట్స్ సంచలనం సృష్టించాయి.
తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే దాదాపు రెండున్నరేళ్ల సమయం ఉంది. విజయ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. అందుకు ఎంతో సమయం ఉంది. ఆయన త్వరలోనే పాదయాత్ర చేసి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారని ఆయన అభిమానులు చెప్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే అన్నాడీఎంకేపై తీవ్ర ప్రభావం పడ్తుందని అంచనా వేస్తున్నారు. పళనిస్వామి, పన్నీరు సెల్వ, శశికళ మధ్య ఆధిపత్య పోరుతో ఆ పార్టీ పతనమైంది. విజయ్ పార్టీ పెడితే కచ్చితంగా అన్నాడీఎంకే కనుమరుగైపోవడం ఖాయమని చెప్తున్నారు.













