బాలు విషయంలో టాలీవుడ్ తప్పు దిద్దుకోదా?
గాన గాంధర్వుడుగా తెలుగువారి మనసుల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తిరిగి రానిలోకాలకు తరలి వెళ్లిపోయారు. సాటిలేని రీతిలో ఆయన సాధించిన ఘనవిజయాలను తెలుగు ప్రజలకు ఆస్తిగా పంచేసి తాను తన గంధర్వలోకానికి పయనమై అప్పుడే కొన్ని రోజులు గడచిపోయింది.
ఇప్పుడిప్పుడే ఆయన మరణం అనే షాక్ నుంచి కోలుకుంటున్న ఆయన అభిమానులు కొందరు తెలుగు సినీ ప్రముఖులు బాల సుబ్రహ్మణ్యంకు సరైన రీతిలో వీడ్కోలు పలకలేదనే బాధ నుంచి మాత్రం కోలుకోలేకపోతున్నారు. చెన్నైలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. తమిళ చిత్ర ప్రముఖులు అనేక మంది ఆయన కడసారి చూపు కోసం వచ్చారు. విలక్షణ నటుడు కమల్‌హాసన్, హీరో అర్జున్ తదితర ఎందరో ఆయన పార్ధివ దేహానికి నివాళులుఅర్పించారు. అయితే బాలుని స్వంత ఆస్తిలా భావించే తెలుగు నాడు నుంచి ఏ ఒక్క స్టార్ హీరో కూడా తుది వీడ్కోలు పలికేందుకు కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం అభిమానుల మనసుల్ని గాయపరచింది.
దీనిపై కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా పలువురు టాలీవుడ్ పరిశ్రమ ప్రముఖులను దుమ్మెత్తి పోస్తున్నారు. కడుపులోని చల్ల కదలకుండా కూర్చుని చిన్ని తెరపై ఇంటర్వ్యూల్లో బాలు ను ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్న వారు ఆయనకు ఇచ్చే గౌరవం ఇంతేనా అని ప్రశ్నిస్తున్నారు. కరోనా భయం ఉన్నప్పటికీ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారని, అవసరాన్ని బట్టి మంత్రులను, ముఖ్యమంత్రులను వేరే నగరాలకు వచ్చి మరీ కలుస్తున్నారని వీరు గుర్తు చేస్తున్నారు. కనీసం టాలీవుడ్ తరపున ఓ నలుగురైదుగురైనా హాజరై ఉంటే ఆ మహా గాయకుడి అభిమానులకు కొంత ఊరట లభించి ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ తరహా వ్యవహార శైలి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులకు కొత్తేమీ కాదని కొందరు అంటున్నారు. గతంలో అమర గాయకుడు ఘంటసాల విషయంలో కూడా ఇదే రకంగా ప్రవర్తించారని చెబుతున్నారు. ఆయన మరణం తర్వాత ఆయనతో ఎంతో అనుబఃంధం ఉన్న ఎన్టీయార్, ఏయన్నార్‌లు సైతం భౌలిక కాయాన్ని సందర్శించేందుకు సమయం లేదన్నారంటూ వీరు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో తమిళ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్ చాలా నేర్చుకోవాల్సి ఉందంటున్నారు. బాలుని ప్రైడ్ ఆఫ్ తమిళనాడు అంటూ అక్కడి ప్రభుత్వం పేర్కొందని, పద్మ అవార్డుకు సిఫారసు చేయడంతో పాటు తుదిదాకా అన్ని రకాలుగా ఆయన్ను గౌరవించిందని గుర్తు చేస్తున్నారు.
తెలుగు రాజకీయ ప్రముఖులతో సహా ప్రతి ఒక్కరినీ సోషల్ మీడియా ఏకి పారేస్తోంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాలు తుది ఘడియల్లో ఆయన పట్ల చూపించాల్సినంత మర్యాద చూపించలేదని దుమ్మెత్తి పోస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తప్ప మరెవరూ బాలు చివరి రోజులలో కనీసం ఆయన ఆరోగ్యం గురించి మరే నేత కూడా వాకబు చేసిన దాఖలాలు కూడా లేకపోవడం దారుణమంటోంది. ఈ పరిస్థితిని గుర్తించి కొంతలో కొంత ఊరటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలుకు భారతరత్న ఇవ్వాలంటూ లేఖ రాసి తన గౌరవాన్ని కొద్దొ గొప్పో కాపాడుకోగలిగింది.
మరోవైపు బాలు మరణం తర్వాత కూడా వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎన్నో వాదోపవాదాలకు కారణమవుతున్న ఈ విషయంపై ఇప్పటిదాకా టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ నోరు మెదపడం లేదు. ఈ విమర్శలు తప్పని తమకు బాలు పట్ల ఉన్న గౌరవం సాటిలేనిదని చెప్పుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇది సరైంది కాదని, ఇప్పటికైనా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎస్పీబాలుకి నివాళిగా ఏదైనా మంచి కార్యక్రమాన్ని ప్రకటించడం ద్వారా తనపై వస్తున్న విమర్శలను కొంచెమైనా తగ్గించుకోవచ్చునని పలువురు సూచిస్తున్నారు.













