చిన్న సినిమాకు ప్రచారాస్త్రంగా మారిన సుకుమార్
టాలీవుడ్ లో రాబోతున్న కొత్త సినిమా సిద్దార్థ్ రాయ్. ఇందులో హీరోగా నటించిన దీపక్ నుంచి హీరోయిన్, నిర్మాత, ఆఖరికి డైరెక్టర్ కూడా కొత్త వాడే. ఇంతమంది కొత్తవాళ్లు చేస్తున్న సినిమా అయినా ఈ సినిమా ఆడియన్స్ దృష్టిలో బాగానే పడింది. దానికి సినిమాలోని కంటెంట్ తో పాటూ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఒక కారణం.
అవును. ఈ సినిమా ఆడియన్స్ కు రీచ్ అవడానికి కారణం సుకుమారే. సిద్దార్థ్ రాయ్ టీజర్ ను జనాలు పెద్దగా పట్టించుకోని టైమ్ లో డైరెక్టర్ యశస్వి దాన్ని సుకుమార్ కు పంపడం, ఆ టీజర్ సుకుమార్ కు నచ్చి డైరెక్టర్ కు మెసెజ్ చేయడం లాంటివి జరిగాయి. దీంతో సినిమాను పూర్తి చేసి సినిమాను కూడా సుకుమార్ కు షో వేసి చూపించాడు డైరెక్టర్.
ఆ సినిమాను చూసిన సుకుమార్, డైరెక్టర్ యశస్విని మెచ్చుకోవడమే కాకుండా తన బ్యానర్లో సినిమా ఆఫర్ కూడా ఇచ్చాడు. దీంతో సుకుమార్ బ్యానర్లో సినిమా చేయబోయే డైరెక్టరే సిద్దార్థ్ రాయ్ డైరెక్టర్ అంటూ ఆడియన్స్ మాట్లాడుకుంటూ ఈ సినిమా గురించి డిస్కస్ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ లో కూడా డైరెక్టర్, మిగిలిన టీమ్ దీని గురించే మాట్లాడి సినిమా అందరికీ తెలిసేలా చేశారు. దానికి తోడు సినిమా ట్రైలర్ కూడా ఇంప్రెస్సివ్ గా ఉండటంతో సిద్దార్థ్ రాయ్ కు ట్రైలర్ రిలీజ్ తర్వాత బాగా హైప్ వచ్చింది.













