పాకిస్తాన్ టెర్రరిస్ట్‌గా కొత్త అవతారంలో కనిపించబోతున్న సమంత?
ఒక నటుడుగానీ, నటిగానీ ఎలాంటి క్యారెక్టర్ అయినా చెయ్యగలరు, ప్రేక్షకుల్ని మెప్పించగలరు అనే పేరు తెచ్చుకున్నారంటే వారి కెరీర్‌కి తిరుగు ఉండదు. ఏ క్యారెక్టర్‌కైనా పూర్తి న్యాయం చేస్తారు. అలాంటి నటనాకౌశలం కలిగి ఉన్న హీరోయిన్ సమంత. ఈమధ్యకాలంలో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్న సమంత రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి సూపర్‌హిట్ సినిమాల్లో తన పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన జాను మాత్రం డిజప్పాయింట్ చేసింది. ఈ సినిమాలోని క్యారెక్టర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది సమంత. తనకు మంచి పేరు తెస్తుందని భావించింది. కానీ, అనుకున్నదొక్కటి జరిగిందొక్కటి. ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా కమిట్ అవ్వలేదు సమంత. భర్త నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేసేందుకు సమంత సిద్ధమవుతోందని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఓ బేబీతో తనకు మంచి హిట్‌ని అందించిన నందినిరెడ్డితో సమంత మరో సినిమా చేయబోతోందని తెలుస్తోంది. అలాగే తమిళ్లో రెండు సినిమాలు చేసేందుకు ఓకే చెప్పిందట. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోవడంతో ఆ సినిమాలన్నీ స్క్రిప్ట్ దశలోనే ఉన్నాయి.
సినిమాల సంగతి పక్కన పెడితే సమంత డిజిటల్ రంగంలోకి ప్రవేశించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడు `ది ఫ్యామిలీ మ్యాన్ 2` రాబోతోంది. ఇందులో సమంత ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ సిరీస్‌లో ఆమె చేయబోతున్న క్యారెక్టర్ ఏమిటి అనేది అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న. అందిన సమాచారం మేరకు సమంత ఈ సిరీస్‌లో ఒక నెగెటివ్ క్యారెక్టర్ చేస్తోందట. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యారెక్టర్ పోషించిందట. ఇటీవల ఈ సిరీస్ షూటింగ్ పూర్తయింది. సమంత తన క్యారెక్టర్‌కి సంబంధించిన డబ్బింగ్‌ను కూడా పూర్తి చేసింది. త్వరలోనే ఈ వెబ్‌సిరీస్ విడుదల కానుంది. ఈ సిరీస్‌లో సమంతతోపాటు సందీప్ కిషన్, ప్రియమణి, మనోజ్ బాజ్‌పాయ్ తదితరులు నటించారు.













