విజయ్‌కు ఊరట.. మైత్రీకి భారీ నష్టాలు!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన రణబాలి సినిమాపై నిర్మాతలు పెట్టుకున్న భారీ అంచనాలు పూర్తిస్థాయిలో నెరవేరలేదనే టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ రూపొందించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. అప్పటి కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్లు, విభిన్నమైన లొకేషన్లు, నిర్మాణ విలువల కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. షూటింగ్ కు ఎక్కువ రోజులు పట్టడంతో పాటు అజయ్- అతుల్, జిష్ణు భట్టాచార్జీ, నీరవ్ షా వంటి ప్రముఖ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. హీరో హీరోయిన్లు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించారు.
దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రణబాలికి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాల్లో సినిమా మెరుగైన కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఇతర ఏరియాల్లో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదని తెలుస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో సినిమా ప్రదర్శన నిరాశాజనకంగా ఉండటంతో అక్కడి బయ్యర్లకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. దేశీయంగా కూడా అన్ని ఏరియాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకొచ్చే స్థాయిలో కలెక్షన్లు రాలేదని ట్రేడ్ విశ్లేషణలు సూచిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే రణబాలి కొంత మెరుగైన ఫలితాన్ని అందించినప్పటికీ, బడ్జెట్ ఎక్కువగా ఉండటమే సినిమాకు మెయిన్ డిజట్వాంటేజ్ గా మారింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాకు మంచి టాక్, కలెక్షన్లు వచ్చినా సరైన లాభాలు రావాలంటే పెట్టుబడికి తగ్గ స్థాయిలో కలెక్షన్లు అవసరం. ఈ విషయంలో రణబాలి వెనుకబడటంతో నిర్మాతలపై ఆర్థిక భారం పడినట్లు తెలుస్తోంది. మొత్తంగా విజయ్‌కు కొంత ఊరటనిచ్చిన ఈ సినిమా, మైత్రీ మూవీ మేకర్స్‌కు మాత్రం ఆశించిన కమర్షియల్ సక్సెస్ ను అందించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








