వీలైనంత త్వరగా మీ ముందుకు వస్తా : పవన్ కల్యాణ్ లేఖ
దేశంలో కరోనా చాలా తీవ్రంగా ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుట పడుతోందని, వైద్యులు సూచించిన సూచనలను పాటిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ పేరిట జనసేన ఓ లేఖను విడుదల చేసింది. వీలైనంత త్వరగా కోలుకోని, మీ ముందుకు వస్తానని లేఖలో పేర్కొన్నారు. ‘‘వీలైనంత త్వరగా కోలుకోని మీ ముందుకు వస్తా. నేను కరోనా బారిన పడ్డాను అని తెలిసినప్పటి నుంచి నా యోగ క్షేమాల గురించి ఆందోళన చెందుతూ నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడ్ని కావాలని ప్రతి ఒక్కరూ ఆశించారు. సందేశాలు పంపారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, అభిమానులు నా గురించి ప్రార్థనా మందిరాల్లో పూజలు, ప్రార్థనలు చేశారని నా దృష్టికి వచ్చింది. మీ గుండెల్లో నాకు స్థానం కల్పించారు. కృతజ్ఞతలు, ధన్యవాదాలు లాంటి పదాలతో నా భావోద్వేగాన్ని వెల్లడించలేకపోతున్నాను. ఎప్పటికీ మీరంతా నా కుటుంబీకులే. ప్రతి ఒక్కరూ మాస్క్, శానిటైజర్‌ను విధిగా వాడాలి’’ అని పవన్ కల్యాణ్ లేఖలో పేర్కొన్నారు. ఏపీలో రానూ రానూ కేసులు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. రోజుకు 7,000 కేసులు, తెలంగాణలో 4,000 పైగా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలని పవన్ కల్యాణ్ సూచించారు.













