స్టార్ అయ్యాక మహేష్ మానేశాడు
మహేష్‌బాబు పుట్టినరోజును చిన్నప్పుడు మద్రాస్‌లో చాలాబాగా చేసేవాళ్లం. ఇప్పుడు స్టార్ అయిన తర్వాత పుట్టినరోజు చేసుకోవడం మానేశాడు. ఇప్పుడూ అభిమానులే మహేష్ పుట్టినరోజు చేస్తున్నారు అని సూపర్‌స్టార్ కృష్ణ వెల్లడించారు. సుధీర్ బాబు నటించిన సమ్మోహనం చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం ఆ చిత్రబృందం కాసేపు కృష్ణతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు. అచ్చ తెలుగు టైటిల్స్ విషయం గురించి అడిగిన ప్రశ్నకు కృష్ణ బదులిస్తూ, సమ్మోహనం అనే టైటిల్‌ను ఇంతకుముందు ఎవరూ పెట్టలేదు. టైటిల్స్ విషయానికి వస్తే అచ్చ తెలుగు టైటిల్స్ బావుంటాయి. మేం తీసిన సినిమాలన్నింటికీ తెలుగు టైటిల్సే పెట్టాం. మేం ఎప్పుడూ ఇతర భాషల టైటిల్స్ పెట్టలేదు. మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, ప్రజారాజ్యం, ఈనాడు వంటివన్నీ తెలుగు పదాలతోనే పెట్టాం అని అన్నారు.













