INCA: ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ 12 చలనచిత్ర పరిశ్రమలను ఏకం చేస్తూ పాన్-ఇండియా వేదికగా అనౌన్స్మెంట్
భారతీయ సినిమా కోసం ఏకీకృత జాతీయ వేదికను నిర్మించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) ఈరోజు అధికారికంగా ప్రకటించబడింది. దీర్ఘకాలిక సంస్థాగత దృష్టితో రూపుదిద్దుకున్న INCA, దేశంలోని 12 సినిమా పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఎక్స్ లెన్స్ ని సెలబ్రేట్ చేయడం, పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం, పారదర్శకమైన, సమగ్ర ప్రక్రియల ద్వారా భారతీయ సినీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది.
INCA స్థాపకుడు విష్ణు వర్ధన్ ఇందూరి. ఆయన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA), సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) వంటి భారతదేశంలో అత్యంత విజయవంతమైన రెండు ఎంటర్టైన్మెంట్ ప్రాపర్టీలను స్థాపించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. గ్రాండియర్, విశ్వసనీయత, దీర్ఘకాల ప్రాధాన్యత కలిగిన వేదికలను నిర్మించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇండియన్ సినిమా కోసం ఒక జాతీయ సంస్థ INCA కేవలం అవార్డుల ప్రదర్శనగా కాకుండా, జాతీయ సినిమా సంస్థగా ఉండబోతుంది. ఈ వేదిక రెండు రోజుల పాటు కొనసాగుతుంది, ఇందులో ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు, మాస్టర్‌క్లాస్‌లు, విధాన సంభాషణలతో కూడిన ఇండియన్ సినిమా కాన్క్లేవ్ ఉంటుంది, తరువాత INCA అవార్డ్స్ నైట్ జరుగుతుంది, అన్ని చలనచిత్ర పరిశ్రమల నుండి కళాత్మక మరియు సాంకేతిక విభాగాలలో అత్యుత్తమ ప్రతిభను సత్కరిస్తుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, అస్సామీ మరియు ఒడియా సినిమాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా, INCA వివిధ పరిశ్రమల సహకారం, భాగస్వామ్యం, సహచరులచే నిర్వహించబడే గుర్తింపును ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా INCAతో చీఫ్ ప్యాట్రన్ మరియు కీలక సంస్థాగత భాగస్వామిగా అనుసంధానమైంది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా సంస్థలతో సమన్వయం, ఉత్తమ ఆచరణలపై నాలెడ్జ్ ఫ్లాట్ ఫాం రూపకల్పన, పాలనలో పారదర్శకత , విశ్వసనీయతను బలోపేతం చేయడంలో గిల్డ్ కీలక పాత్ర పోషించనుంది.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిబాశిష్ సర్కార్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాను నిజమైన జాతీయ వేదికపైకి తీసుకువచ్చే దిశగా INCA ఒక కీలక ముందడుగు. భాషలు, ప్రాంతాల మధ్య పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, సహకారం, నాలెడ్జ్ ఎక్స్ చేంజ్, పారదర్శక గుర్తింపును ప్రోత్సహించే విశ్వసనీయ సంస్థలు అవసరం. దేశవ్యాప్తంగా ఉన్న నిర్మాతలు, ఫిలిం మేకర్స్ కు మేలు చేసే చర్చలను రూపుదిద్దడంలో INCAతో కలిసి పనిచేయడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆసక్తిగా ఉంది.
INCA ప్రారంభంపై విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.. భారతీయ సినిమా ఈ రోజు జాతీయంగా, అంతర్జాతీయంగా అపూర్వమైన గుర్తింపును పొందుతోంది. అయినప్పటికీ, మనం ఇంకా ఇంకా విడివిడిగా పనిచేస్తున్నాం. మొత్తం భారతీయ సినీ పరిశ్రమకు చెందే వేదికగా, ఎక్స్ లెన్స్ ని గౌరవిస్తూ, సహకారాన్ని ప్రోత్సహిస్తూ, భారతీయ సినిమాకు ఒక సంయుక్త జాతీయ గుర్తింపును నిర్మించడమే INCA లక్ష్యం. ఈ ప్రయాణంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అందిస్తున్న మద్దతు, మార్గదర్శకత్వానికి నేను కృతజ్ఞుడిని.
INCA అవార్డులు బలమైన, ప్రజాస్వామ్యాత్మక ఎంపిక ప్రక్రియను అనుసరిస్తాయి. గుర్తింపు పొందిన సినిమా సంస్థల సభ్యుల ద్వారా పరిశ్రమవ్యాప్తంగా ఓటింగ్, అలాగే స్వతంత్ర తృతీయ పక్ష ఆడిట్ , ధృవీకరణ ఈ ప్రక్రియలో భాగంగా ఉంటాయి. దీనివల్ల నమ్మకమైన, న్యాయమైన, నిజమైన సహచరుల గుర్తింపును నిర్ధారించనున్నారు.
INCA తొలి ఎడిషన్‌ను రెండు రోజుల జాతీయ స్థాయి కార్యక్రమంగా నిర్వహించనున్నారు. ఇందులో ఫిల్మ్ మేకర్స్, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, OTT వేదికలు, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొని, భారతీయ సినిమా పరిణామంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకనున్నారు.






