రూ. కోటి విలువైన ప్రాపర్టీ అమ్మినా ఒక్క పైసా టీడీఎస్ కట్ అవ్వదు.. ఈ ట్రిక్ మీకు తెలుసా?
Property Sale: సాధారణంగా భారతదేశంలో ప్రవాస భారతీయులు (NRI) తమ ఆస్తులను విక్రయించినప్పుడు భారీగా పన్ను (TDS) చెల్లించాల్సి ఉంటుంది. నివాస భారతీయులకు కేవలం 1 శాతం టీడీఎస్ ఉంటే, ఎన్ఆర్ఐలకు మాత్రం ఇది 12.5 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అయితే, ఒక చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే ఈ పన్నును పూర్తిగా మినహాయించుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
లాభం మీద కాకుండా..
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 195 ప్రకారం, కొనుగోలుదారుడు అమ్మకందారునికి డబ్బు చెల్లించే ముందే టీడీఎస్ కట్ చేయాలి. ఈ టీడీఎస్‌ను కేవలం లాభం మీద కాకుండా, మొత్తం అమ్మకపు విలువ మీద లెక్కిస్తారు. ఉదాహరణకు, ఒక ఎన్ఆర్ఐ తన ఆస్తిని రూ. 1 కోటికి అమ్మితే, లాభం ఎంత వచ్చినా సంబంధం లేకుండా రూ. 12.5 లక్షలు టీడీఎస్ కట్ అవుతుంది. ఈ సొమ్ము తిరిగి రావాలంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి 6 నుండి 12 నెలల వరకు వేచి చూడాలి.
ఫామ్ 13 (Low/Nil TDS Certificate)..
ఈ ఫామ్ ద్వారా ఎన్ఆర్ఐలు అధిక పన్ను కోత నుండి తప్పించుకోవచ్చు.
ఆస్తిని విక్రయించే ముందే అమ్మకందారుడు ఆదాయపు పన్ను శాఖలోని అసెస్సింగ్ ఆఫీసర్ (AO)కు దరఖాస్తు చేసుకోవాలి.
ఆస్తి కొన్న ధర, అమ్మకపు ధర, ఇండెక్సేషన్ ప్రయోజనాలు , సెక్షన్ 54 కింద పొందే మినహాయింపుల వివరాలను అధికారులకు అందజేయాలి.
అధికారులు లెక్కలతో సంతృప్తి చెందితే, తక్కువ పన్ను లేదా సున్నా పన్ను (Nil TDS) కోతకు అనుమతినిస్తూ ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు.
కొనుగోలుదారునికి ఈ సర్టిఫికేట్‌ను చూపిస్తే, వారు పన్ను మినహాయించకుండా పూర్తి మొత్తాన్ని మీకు చెల్లిస్తారు.
ప్రయోజనం..
దీనివల్ల లక్షలాది రూపాయల నగదు ఆదాయపు పన్ను శాఖ వద్ద చిక్కుకుపోకుండా ఉంటుంది. రీఫండ్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. పన్ను చట్టాల పట్ల అవగాహన ఉంటే, ఏ లొసుగులు వెతకకుండానే చట్టబద్ధంగా తమ సొంత సొమ్మును కాపాడుకోవచ్చని ఈ ఉదాహరణ నిరూపిస్తోంది.
ఇవి కూడా చదవండి








