ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా.. అయితే మీరు ఈ రిస్క్‌లో ఉన్నట్టే!
Bank Accounts: చాలామంది సౌలభ్యం కోసం లేదా ఉద్యోగాలు మారినప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను మెయింటెన్ చేస్తుంటారు. శాలరీకి ఒకటి, పొదుపుకు మరొకటి ఉండటం మంచిదే అనిపించినా.. ఖాతాల సంఖ్య పరిమితికి మించితే లాభం కంటే నష్టమే ఎక్కువని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ అకౌంట్లు ఉండటం వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్యలు ..
అంచనా కష్టం..
డబ్బు వివిధ ఖాతాల్లో ముక్కలు ముక్కలుగా ఉండటం వల్ల, మీ దగ్గర మొత్తం ఎంత నగదు ఉందో ఒక్కసారిగా అంచనా వేయడం కష్టమవుతుంది. దీనివల్ల మీ నెట్ వర్త్ (Net worth) పై స్పష్టత ఉండదు , అనవసర ఖర్చులను నియంత్రించలేరు.
ఇవి కూడా చదవండి
ఫ్రాడ్స్ గుర్తించలేకపోవడం..
ప్రతి ఖాతాకు విడివిడిగా పాస్వర్డ్లు, స్టేట్మెంట్లు, నోటిఫికేషన్లు ఉంటాయి. ఖాతాలు పెరిగే కొద్దీ వాటన్నింటినీ పర్యవేక్షించడం (Monitoring) కష్టమవుతుంది. ఈ క్రమంలోనే బ్యాంక్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు గుర్తించలేకపోవడం లేదా ఫెయిల్ అయిన లావాదేవీలను గమనించకపోవడం వంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
భారీ పెనాల్టీలు..
ప్రతి అకౌంట్లో ‘కనీస నిల్వ’ (Minimum Balance) ఉండాలనే నిబంధన ఉంటుంది. ఐదు ఖాతాలు ఉంటే, వాటన్నింటిలోనూ కొంత నగదును ఖర్చు చేయకుండా ఉంచాల్సి వస్తుంది. ఒకవేళ పొరపాటున బ్యాలెన్స్ తగ్గితే భారీగా పెనాల్టీలు పడతాయి. అలాగే, అన్ని ఖాతాలకు ఏటా డెబిట్ కార్డ్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఫీజులు భరించాల్సి వస్తుంది.
నెలవారీ బిల్లులు..
ఇన్సూరెన్స్ ప్రీమియంలు, నెలవారీ బిల్లులు లేదా SIPలు ఆటోమేటిక్ గా కట్ అవ్వాల్సి ఉన్నప్పుడు.. ఏ అకౌంట్లో డబ్బు ఉందో తెలియక పొరపాట్లు జరుగుతుంటాయి. తగినంత బ్యాలెన్స్ లేక పేమెంట్ ఫెయిల్ అయితే అదనపు ఛార్జీలు పడతాయి.
నిపుణుల సూచన..
ఆర్థిక నిర్వహణలో సరళత (Simplicity) ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు అవసరమైన ఒకటి లేదా రెండు అకౌంట్లను ఉంచుకుని, మిగిలిన వాటిని క్లోజ్ చేయడం ఉత్తమం. దీనివల్ల మీ డబ్బుపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది , అనవసరపు ఛార్జీల భారం తప్పుతుంది.
ఇవి కూడా చదవండి








