నిమిషాల్లో ఛార్జింగ్.. 710 కిమీల రేంజ్.. మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ కారు!
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వినియోగం నానాటికీ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకునేందుకు, పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యేందుకు వాహనదారులు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం బీవైడీ (BYD) చైనా మార్కెట్లో విడుదల చేసిన ఓ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇప్పుడు మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. ‘సాంగ్ అల్ట్రా ఈవీ’ (Song Ultra EV) పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు.. విడుదలైన కేవలం ఒక్క నెలలోనే ఏకంగా 60 వేలకు పైగా ఆర్డర్లను సొంతం చేసుకుని ఆటోమొబైల్ పరిశ్రమను విస్మయానికి గురిచేస్తోంది.
ఇవి కూడా చదవండి
టెస్లాకు గట్టి పోటీ..
చైనా మార్కెట్లో ఎలక్ట్రిక్ రంగంలో రారాజుగా ఉన్న టెస్లా మోడల్ వై (Tesla Model Y), అలాగే ఎక్స్‌పెంగ్ జీ6 వంటి పాపులర్ కార్లకు బీవైడీ సాంగ్ అల్ట్రా ఈవీ (Song Ultra EV) గట్టి పోటీనిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కొలతల పరంగా చూస్తే.. 4,850 మిమీ పొడవు, 1,910 మిమీ వెడల్పు, 1,670 మిమీ ఎత్తును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ (రెండు చక్రాల మధ్య దూరం) 2,840 మిమీగా ఉండటం వల్ల లోపల కూర్చునే ప్రయాణికులకు అత్యంత విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్‌లా కళ్లుచెదిరే ఫాస్ట్ ఛార్జింగ్
ఎలక్ట్రిక్ కారు కొనేవారిని వేధించే ప్రధాన సమస్య.. ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూడటం! బీవైడీ తన కొత్త ‘సాంగ్ అల్ట్రా ఈవీ’తో (Song Ultra EV) ఈ సమస్యకు శాశ్వత చెక్ పెట్టింది. అధునాతన ‘బ్లేడ్ బ్యాటరీ 2.0’ సాంకేతికత, అత్యాధునిక ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ కారు సరికొత్త విప్లవానికి తెరతీసింది. ఈ కారు బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 70 శాతానికి ఛార్జ్ అవుతుంది. ఓ స్మార్ట్‌ఫోన్ తరహాలో కేవలం 9 నిమిషాల్లోనే ఏకంగా 97 శాతం వరకు ఛార్జ్ కావడం దీని అతిపెద్ద ప్రత్యేకత. అంతేకాకుండా, మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ (-30°C) లాంటి అత్యంత శీతల వాతావరణంలో కూడా ఈ కారు కేవలం 12 నిమిషాల్లోనే సమర్థవంతంగా ఛార్జ్ అవుతుందని కంపెనీ గర్వంగా చెబుతోంది.
రేంజ్ ఆందోళన లేదు..
సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు ఈ కారు (Song Ultra EV) సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 710 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని ఇస్తుండటం మరో ప్లస్ పాయింట్. అంటే, మధ్యలో ఛార్జింగ్ అయిపోతుందనే ఆందోళన లేకుండా సుదూర ప్రయాణాలు చేయవచ్చు. ఇన్ని అత్యాధునిక, ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ బీవైడీ ఈ కారు ధరను సామాన్యులకు అందుబాటులో ఉంచడం విశేషం. చైనా మార్కెట్లో దీని ప్రారంభ ధరను 1,51,900 యువాన్లుగా (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 21 లక్షలు) నిర్ణయించింది. ఈ కిల్లర్ ప్రైసింగ్, అద్భుతమైన ఫీచర్ల వల్లే.. లాంచ్ అయిన మొదటి వారంలోనే 10,000 బుకింగ్స్, మొదటి నెల ముగిసే సరికి ఏకంగా 61,240 భారీ బుకింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది. మున్ముందు ఈ మోడల్ (Song Ultra EV) గ్లోబల్ మార్కెట్లోకి, ముఖ్యంగా భారతీయ రోడ్లపైకి వస్తే ఎలక్ట్రిక్ కార్ల రంగంలో పెను సంచలనం సృష్టించడం ఖాయమని ఆటోమొబైల్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి








