టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గుత్తా నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియాలో సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో ఎమ్మెల్సీ యాదవ్రెడ్డిపై అనర్హత వేటు పడటంతో ప్రస్తుతం ఆస్థానం ఖాళీగా ఉంది. తాజాగా ఈ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా పేరును ఖరారు చేశారు. ఈ నెల 7న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.













