ఈ నెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శాసనసభ బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చించారు. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంతో పాటు ఏయే అంశాలపై సభ నడపాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో శాసనసభకు సెలవులు ఇవ్వనున్నారు. మొత్తం 18 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. శాసనసభలో గంటపాటు ప్రశ్నోత్తరాలు, అరగంటపాటు జీరో అవర్ నిర్వహించనున్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలపై రేపు సభలో చర్చ చేపట్టి పలు తీర్మానాలు చేయనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త రెవెన్యూ చట్టం బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. అనంతరం ఆ బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేయనుంది.













