అంగన్వాడీల్లో నాణ్యత లేని గుడ్ల పంపిణీ.. ముప్పు పొంచి ఉందంటున్న నిపుణులు
Anganwadi: ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్ల పంపిణీలో తీవ్ర లోపాలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. నాణ్యత విషయంలో రాజీపడుతూ అతి చిన్న పరిమాణంలో ఉన్న గుడ్లను, పగిలిన వాటిని చిన్నారులకు అందజేస్తున్నట్లు స్పష్టమైంది. మార్కెట్లో డిమాండ్ లేని ఇలాంటి నాసిరకం గుడ్లను వ్యాపారులు అంగన్వాడీలకు తరలిస్తూ ప్రభుత్వం నుండి మాత్రం పూర్తి ధర వసూలు చేస్తున్నారని పరిశోధనలో తేలింది.
బ్యాక్టీరియా ముప్పు..
రవాణా , నిల్వ సమయంలో సరైన ‘కోల్డ్ చైన్’ పద్ధతులు పాటించకపోవడం వల్ల గుడ్లు త్వరగా పాడవుతున్నాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వారం రోజుల్లోనే ఇవి కుళ్ళిపోతున్నాయి. ఇలా పగిలిన , పాడైన గుడ్ల ద్వారా ‘సాల్మోనెల్లా’ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా చేరి ఆహారం కలుషితమవుతోందని, ఇది చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం..
నాణ్యమైన పోషకాహారం అందకపోవడం వల్ల అంగన్వాడీ పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల ఉండటం లేదని లండన్ రాయల్ వెటర్నరీ కాలేజ్ , హైదరాబాద్ NIN వంటి సంస్థల శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల పిల్లలు ప్రత్యామ్నాయ పోషకాహారాన్ని తీసుకోలేకపోవడం వల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన నిల్వ వసతులు , పర్యవేక్షణ అవసరమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఇవి కూడా చదవండి








