కరోనా ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెరాస…
నిన్నామొన్నటి దాకా గులాబీ పార్టీని వేలెత్తి చూపించడానికి కూడా మార్గాలు వెతుక్కోవడానికి తంటాలు పడే పరిస్థితి ఇప్పుడు అదే పార్టీ నలువైపులా ముట్టడితో సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. తిరుగులేని హవాతో సాగిపోతున్న కెసియార్ సర్కార్‌కు కరోనా తిప్పలు తెచ్చిపెట్టింది. గత రెండు రోజులుగా 1800కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ హోంమంత్రి సహా ప్రముఖులెందరో కరోనా బారిన పడడం ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. ఆఖరికి సిఎం నివాసమైన ప్రగతి భవన్‌లోనూ 30 మంది వరకూ కోవిడ్ బారిన పడినట్లు వార్తలొస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కోవిడ్ ప్రభావం తీవ్రాతి తీవ్రంగా ఉంది. కరోనా ప్రభావానికి లాక్డౌన్ ప్రచారం తోడవడంతో చాలా మంది నగరాన్ని వదిలి సొంతూళ్లకు ప్రయాణమవుతుండడం ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా మారింది. ఇప్పటిదాకా హైదరాబాద్ నుంచి దాదాపు 25 లక్షల మంది స్వంత ఊర్లకు వెళ్లిపోయారని అంచనా వేస్తున్నారు..
తెలంగాణలో ఇప్పటి వరకూ 1,10,545 టెస్టులు చేస్తే.. 22,312 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పాజిటివ్ రేటు ఎక్కువగా ఉండడం గమనార్హం. మరోవైపు ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో కేసీఆర్ ఎక్కడ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్లో #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ గా మారింది. జనం హైదరాబాద్ వదిలి వెళ్తున్న న్యూస్ క్లిప్పింగులను ట్వీట్ చేసి… కాపాడాల్సిన వాళ్లే కనపడకుండా పోయారని విమర్శిస్తున్నారు. మరోవైపు విపక్షాలు కూడా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. కరోనా నియంత్రణ విషయంలో తెరాస సర్కార్ చేతులెత్తేసిందని దుమ్మెత్తి పోస్తున్నాయి. జులై 2న దేశంలో పాజిటివ్ రేట్ 6.68 శాతం కాగా తెలంగాణలో జూన్ 27 నుంచి జులై 4 తేదీల మధ్య కనిష్టంగా 22.64 శాతం, గరిష్టంగా 36.82 శాతంగా నమోదైందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మకాం మార్చారా? అని ప్రశ్నించింది.













