ఇంద్రవెల్లిలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం
మూడు నెలల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అవుతారని కొందరు అంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అన్ని వర్గాలను నట్టేట ముంచిన కేఆర్కు ముఖ్యమంత్రి పదవి కాదు కదా, మంత్రి పదవి కూడా రాదన్నారు. ఇంద్రవెల్లి మట్టికి గొప్పదనం ఉంది. ఇక్కడ వేసే ప్రతి అడుగులో పోరాట పటిమ ఉంది. చరిత్ర పుటలో పౌరుషం గురించి చర్చించాలంటే రాంజీగోండ్ గురించి ప్రస్తావించాలి. ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నాం. అమరవీరుల స్తూపం సాక్షిగా కేసీఆర్ పాలనను అంతం చేశాం. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం. గూడేలకు రోడ్ల, నాగోబా ఆలయ ఆభివృద్ధి పనులను ప్రారంభించాం. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తీసుకుంటాం అన్నారు.
1981లో కాంగ్రెస్ వాళ్లే ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలను పొట్టనపెటుటకున్నారని కొందరు విమర్శించారు. ఇంద్రవెల్లి దారుణంపై నేను ఆనాడే క్షమాఫన చెప్పా. సీమాంధ్ర పాలకుల హయాంలో ఆ తప్పు జరిగింది. అప్పుడు జరిగిన తప్పులు సరిచేసేందుకే సోనియా తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వసం రాష్ట్రంగా మార్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. కేసీఆర్ కుటుంబం కోసమే రాష్ట్రం వచ్చిందా? పదేళ్లలో ఏనాడైనా ఇంద్రవెల్లి అడవిబిడ్డల గురించి ఆలోచించారా? సమస్యల పరిష్కారం కోసం ప్రజాగాయకుడు గద్దర్ ప్రగతి భవన్కు వెళ్తే గేటు బయట నిలబెట్టారు. కేసీఆర్కు గద్దర్ ఉసురు తగిలింది. కోటి ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి రూ.వేల కోట్లు దోచుకున్నారు అని అన్నారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసే బాధ్యత మంత్రివర్గం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. త్వరలో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్నీ అమలు చేస్తాం. రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు భర్తీ చేసే బాధ్యత మాది. ఇప్పటికే 7 వేల ఉద్యోగాలు ఇచ్చాం. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి అని పిలుపునిచ్చారు.













