ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. 105 సీట్లు గెలుస్తాం : కేసీఆర్
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశామని అన్నారు. రాష్ట్రాభివృద్ధి వేడుకలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయన్నారు. మరో ఆరు మాసాల్లో ఎన్నికలు వస్తాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజల మధ్యే ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ పదేళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని, చేసింది చెప్పుకుంటే చాలని కేసీఆర్ సూచించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ తీసేస్తే మరో 5 నెలల్లో మాత్రమే ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల నేతలంతా పూర్తిస్థాయిలో నియోజకవర్గాలకు పరిమితం కావాలని సూచించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.













