కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధంతోనే.., ఈ నిర్ణయం తీసుకున్నారా?
గవర్నర్ రాష్ట్ర ప్రజలకు బాధ్యులే గానీ, సీఎం రేవంత్ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత్ర తీరును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే, రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని అభ్యర్థిత్వాలను తిరస్కరించారని ఆక్షేపించారు. ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరామ్ పేరును ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. నాడు కనిపించిన రాజకీయ నేపథ్యం ఇవాళ ఎందుకు కనిపించలేదు? కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించారు. సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలని, పర్సన్ ఇన్ఛార్జులను పెట్టొదని కోరారు. ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైక ప్రజాప్రతినిధులే చేయాలన్నారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు పరిపాలనా సమయం పోయిందని, పదవీకాలన్ని ఆర్నెళ్లు లేదా ఎన్నికలు నిర్వహించే వరకు పొడిగించాలన్నారు.













