ఒంటరిగానే బీజేపీ పోటీ
తెలంగాణలో తెలంగాణ బీజేపీకి స్పష్టమైన ప్రజా మద్దతు ఉందని, తాము ఒంటరిగానే గెలుస్తామని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. నారాయణపేటలో బీజేపీ విజయ సంకల్ప ప్రజాయాత్రతో ఎన్నికల ప్రచారాన్ని కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అగ్రనేతలు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వీలుగా ఒకేసారి ఐదు ప్రాంతాల్లో యాత్రలు చేపట్టామన్నారు.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు పోటీ చేసి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీజేపీకి.. మునిగిపోతున్న బీఆర్ ఎస్ తో కలవబోదని స్పష్టం చేశారు. గతంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. కొందరు అక్రమార్కులు కుట్రపూరితంగా ఈ ప్రచారం చేస్తున్నారని, బుద్ధి లేని వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. బీజేపీ శ్రేణులను ప్రజలు ఆశీర్వదించాలని, బహిరంగ సభలు ఉండవని, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు తొలి సమావేశంలోనే తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ యాత్రలు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే. అరుణ, మాజీ ఎంపీ ఏపీ. జితేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, బంగారు శృతి, కొండయ్య, మాదిరెడ్డి జలంధర్ రెడ్డి, కొత్తకాపు రతంగపాండు రెడ్డి, జిల్లా నాయకులు పగడాకుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.













