బండి కుమారుడి చుట్టూ ఆసక్తికర రాజకీయం!
కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ప్రస్తుతం ఒక పెను సంచలనం నెలకొంది. హనీ ట్రాప్, బ్లాక్మెయిల్, మైనర్ వేధింపుల వంటి తీవ్రమైన ఆరోపణలతో కూడిన ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఇరు పక్షాల నుంచి పరస్పర విరుద్ధమైన ఫిర్యాదులు అందడం రాజకీయంగానూ, సామాజికంగానూ పెను దుమారం రేపుతోంది.
బండి భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనను కొంతకాలంగా ఒక కుటుంబం పథకం ప్రకారం హనీ ట్రాప్ చేసి, బ్లాక్మెయిల్ చేస్తోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తన నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తోందని భగీరథ్ ఆరోపించారు.
స్నేహితుల ద్వారా పరిచయమైన సదరు యువతితో కలిసి పార్టీలు, ఫంక్షన్లు, చివరకు గుడులకు కూడా వెళ్లానని, అయితే ఇప్పుడు ఆ సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లతో తనను వేధిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే సదరు యువతి తండ్రికి రూ.50,000 చెల్లించానని, అయినప్పటికీ వారు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు కావాలని ఒత్తిడి తెస్తున్నారని భగీరథ్ పోలీసులకు వివరించారు.
భగీరథ్ ఫిర్యాదు చేసిన కొద్ది సేపటికే సదరు యువతి కుటుంబం కూడా పోలీసులను ఆశ్రయించడం ఈ కేసులో కీలక మలుపు. అయితే, వారు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేస్తూ భగీరథ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ యువతి మైనర్ అని, భగీరథ్ ఆమెను వేధించాడని ఆ కుటుంబం పేర్కొంది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని ప్రాథమిక విచారణలో తేలితే, భగీరథ్‌పై అత్యంత కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది బండి సంజయ్ కుటుంబానికి రాజకీయంగా పెద్ద ఇబ్బందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ మొత్తం ఉదంతం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందనే ప్రచారం కూడా బలంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు ముందు ఈ వివాదం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోందని, ఈ క్రమంలో బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించి, ఆ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్న సొంత పార్టీకి చెందిన కొందరు నేతలే ఈ వ్యవహారాన్ని వ్యూహాత్మకంగా బయటకు తెచ్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ కేసుపై రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కుమారుడు నిజంగానే ఒక ప్రాన్ ప్రకారం హనీ ట్రాప్‌కు గురయ్యారా? లేక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ముందే ఫిర్యాదు చేశారా? ఈ రెండు వెర్షన్లలో ఏది నిజమనేది పోలీసుల లోతైన విచారణలో మాత్రమే తేలాల్సి ఉంది. ఒకవైపు కేంద్ర మంత్రి కుమారుడి హోదా, మరోవైపు మైనర్ బాలిక రక్షణకు సంబంధించిన అంశం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిందితులు ఎవరైనా, చట్టం తన పని తాను చేసుకుపోతుందా లేదా రాజకీయ ఒత్తిళ్లు పని చేస్తాయా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.








