ఈ మార్పు ఏ తీరాలకు..?
వైసీపీలో మార్పులు చేర్పులు..ఆపార్టీ నేతలను ఆలోచనలో పడేస్తున్నాయి. ఇన్నాళ్లుజెండా మోశాం.. మాకెందుకు అవకాశం దక్కడంలేదని కొందరు, గత ఎన్నికల్లో మాంచి మెజార్టీతో విజయం సాధించాం… మేం గెలవలేమనడం ఏమిటి? దానికి తోడు ఎన్నికలకు మూడు నెలల ముందు ఎవరినో తెచ్చి మీ అభ్యర్థి గెలిపించండని చెప్పడమేంటి..? అసలు మేం ఎవరికోసం కష్టపడుతున్నాం.. అసలు పార్టీలో ఏం జరుగుతోంది.. ఇప్పుడిదే వైసీపీ అసంతృప్త నేతలు, కార్యకర్తల్లో వ్యక్తమవుతున్న ఆవేదన.అందులోనూ వైఎస్ జగన్‌కు చాలా సన్నిహితులుగా మెసలిన వారు సైతం.. ఇప్పుడు సైలెంట్‌గా సైడై పోతున్నారు. వారందరూ చెప్పే మాట ఒక్కటే.. ఈ రాజకీయాలకు మేం సరిపడం. అందుకే పార్టీని వీడిపోతున్నామని.. అయితే వారి అనుచరులు, కార్యకర్తలు మాత్రం మానేతను అవమానించారని వాపోతున్నారు.
తాడేపల్లి క్యాంపాఫీసులో జిల్లాల వారీగా నేతలను పిలిచి టికెట్లపై వారికి క్లారిటీ ఇస్తున్నారు. అయితే చాలామంది నేతలకు సీఎం తానుగా చెప్పకుండా సీఎంవో అధికారితో చెప్పిస్తున్నారని సమాచారం. పార్టీ పెట్టినప్పటి నుంచి, సీఎం జగన్ వెంటే ఉంటూ వచ్చిన తమను.. మీరు గెలవరు కాబట్టి వేరేవారికి టికెట్లు ఇస్తామంటూ చెప్పడం ఎంతవరకూ సమంజసమని వారు వాపోతున్నారు. మొన్నటికి మొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే… పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాదు.. రాజకీయాల నుంచే వైదొలుగుతామంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక పెనమలూరు నుంచి గెల్చిన పార్థసారథి అయితే.. తనను జగన్ గుర్తించడం లేదని వాపోయారు. ఇప్పటికీ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన తనకీ పరిస్థితి ఏంటన్నట్లుంది ఆయన భావన. 2019 ఎన్నికల్లో గిద్దలూరు నుంచి అన్నా వెంకట రాంబాబు 81వేలకు పైగా మెజారిటీతో గెలిచారు.
రాష్ట్రంలో సీఎం జగన్ తర్వాత రెండో అత్యధిక మెజారిటీ ఆయనదే. అలాంటి ఆయన రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడం … వైసీపీలో పరిస్థితికి అద్దం పడుతోందని మరికొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇష్టం లేని వ్యక్తుల కోసం మనసుచంపుకుని పనిచేయాల్సి వస్తోంది.. రాజకీయాల్లో పనిచేయాలంటే ఇలా ఉండక తప్పదని పలువురు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది. అయితే.. తాము సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు నేతలు. అయితే తమకు టికెట్ రాదని ఖరారైన తర్వాతే.. నేతలు వేరే పార్టీల్లోకి మారడం జరుగుతుందని చెబుతున్నారు. అయితే ఆల్రెడీ చాలా మంది నేతల దగ్గర ప్లాన్ బి కూడా ఉందంటున్నారు. ఇలా ఎడాపెడా మార్పులు చేర్పులు చేయడం పార్టీకి చేటవుతుందన్న ఆందోళన పార్టీలో కనిపిస్తోంది.
కేవలం మూడు నెలల ముందు ఇలా మారిస్తే.. కొత్తనేతలకు, కేడర్ ఎంతవరకూ సహకరిస్తుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతలు పార్టీ వీడినా వారికి ఇతర పార్టీల్లో టికెట్ దక్కే పరిస్థితి లేదన్నది .. వైసీపీ హైకమాండ్ భావనగా మరికొందరు చెబుతున్నారు. ఇప్పుడు ఈ పార్టీకి రిజైన్ చేసినా వేరే చోట సీటు ఛాన్స్ లేకపోవడంతో.. ఈ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటారని హైకమాండ్ ఆలోచిస్తుందన్న అభిప్రాయం క్యాడర్లో వినిపిస్తోంది. అయితే .. వైసీపీలో మార్పులు, చేర్పులను టీడీపీ, జనసేన, బీజేపీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.













