Rajya Sabha : టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లేనా..!?
ఆంధ్రప్రదేశ్ (AP) లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటిపోయింది. ఇప్పుడిప్పుడే పాలనపై పట్టు సాధిస్తోంది. అధికారుల బదిలీలు, ప్రయారిటీ ప్రోగ్రామ్స్ ను పట్టాలెక్కించేందుకు చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం మొదట దృష్టి పెట్టింది. మధ్యలో వరదలు కూడా రావడంతో రాజకీయాలపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అయితే ఇప్పుడు పార్టీపరంగా తీసుకోవాల్సిన అంశాలు, ప్రభుత్వంలో పార్టీ నేతలకు పదవులు లాంటి అంశాలపై ఆయన దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఖాళీ అయిన మూడు రాజ్యసభ (Rajyasabha) స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయడంపై ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఓడిపోయి.. టీడీపీ (TDP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీకి (YCP) రాజీనామా చేశారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్ రావు (Beeda Mastan Rao), ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు చేసి బయటికొచ్చారు. వీళ్ల ముగ్గురి రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ ఇప్పటికే ఆమోదించారు. త్వరలోనే ఈ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మోపిదేవి పదవీకాలం 2026 వరకూ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య పదవీకాలం 2028 వరకూ ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికయ్యే సభ్యుల పదవీకాలం కూడా ఇంతవరకే ఉండనుంది.
మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇప్పటికే టీడీపీలో (TDP) చేరారు. మోపిదేవి వెంకటరమణ తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి ఉందని ఇప్పటికే చెప్పారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా (MLC) అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. బీద మస్తాన్ రావు మాత్రం మళ్లీ ఎంపీగా వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్.కృష్ణయ్య మాత్రం ఇంకా ఏ పార్టీలో చేరలేదు. తెలంగాణలో సొంత పార్టీ పెడతారని.. లేదంటే బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
అయితే వైసీపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాలనూ ఇప్పుడు టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. అయితే మూడు స్థానాలనూ టీడీపీ తీసుకుంటుందా లేకుంటే బీజేపీ, జనసేనకు కూడా వాటా ఇస్తుందా అనేది తెలియట్లేదు. అయితే టీడీపీలో చేరిన ఇద్దరు వ్యక్తుల స్థానంలో ఇద్దరిని టీడీపీ తరపునే పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. ఒక స్థానాని బీజేపీకి (BJP) వదులుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ నుంచి ఒక స్థానానికి బీద మస్తాన్ రావు పేరు ఖాయంగా కనిపిస్తోంది. మరో స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంది. వర్ల రామయ్య (Varla Ramaiah), దేవినేని ఉమా మహేశ్వర రావు (Devineni Uma Maheswara Rao), గల్లా జయదేవ్ (Galla Jayadev) తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. అలాగే తెలంగాణ నుంచి కూడా టికెట్ ఆశించేవాళ్లున్నారు.
ఇక మూడో స్థానాన్ని బీజేపీకి ఇస్తే ఆ పార్టీ తరపున కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) సీటు ఆశిస్తున్నారు. ఇటీవలే ఆయన సీఎం చంద్రబాబును కూడా కలిసి తన మనోభావాన్ని తెలియజేసినట్లు సమాచారం. అయితే బీజేపీ హైకమాండ్ సీటు ఎవరికి ఇస్తుందో తెలీదు. జనసేనకు (Janasena) కూడా ఓ సీటు ఇవ్వొచ్చని.. ఆ స్థానం నుంచి నాగబాబు (Nagababu) బరిలో దిగుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దఫా జనసేనకు టికెట్ అవకాశం లేదు. మున్ముందు ఖాళీ అయ్యే స్థానాల్లో ఒక దాన్ని కచ్చితంగా జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉంది.













