ఎన్డీయేలో టీడీపీ చేరడం ఖాయమా…? ఇందులో నిజమెంత..?
ఆ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక మాటన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత స్ట్రాంగ్‌గా బీజేపీ ఏపీలో ఉందన్నారు. అదేంటీ.. అంత మాటన్నారు.. అసలు బీజేపీకి ఒక్క సీటు కూడా ఏపీలో లేదు కదా.. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకలా అన్నారని చాలా మంది ఆలోచించారు. దీనికి ఉండవల్లే సమాధానం కూడా చెప్పారు. ఏ రాష్ట్రంలో అయినా ఒక పార్టీ మాత్రమే కేంద్రంలోని బీజేపీకి మద్దతుగా ఉందన్నారు. కానీ ఏపీలో మాత్రం అధికార ప్రతిపక్షాలు రెండూ బీజేపీకి అండగా నిలుస్తున్నాయని.. కేంద్రం అడిగినా అడగకపోయినా మద్దతిచ్చేందుకు ఈ రెండు పార్టీలూ పోటీ పడుతున్నాయని ఉండవల్లి చెప్పారు. అప్పుడు నిజమే కదా అని అందరూ అనుకున్నారు.
అయితే ఇప్పుడు ఎన్డీయేలో టీడీపీ మళ్లీ చేరడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. అధికార వైసీపీ .. కేంద్రంలోని బీజేపీకి ప్రతి అంశంలోనూ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. కేంద్ర బీజేపీ పెద్దలతో వైసీపీ నేతలకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని చేర్చేకోవడానికి బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తుందని చాలా మందికి ఇంకా అనుమానాలున్నాయి. ఇది కేవలం టీడీపీ చేస్తున్న ప్రచారమే తప్ప.. బీజేపీకి అసలు అలాంటి ఆలోచనే లేదని పలువురు చెప్తున్నారు.
అసలు ఇలాంటి ప్రచారం ఎక్కడ మొదలైంది? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు సంబంధించిన సన్నాహక కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం నుంచి పిలుపొచ్చింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబును.. ప్రధాని మోదీ పక్కకు పిలిచి కాసేపు మాట్లాడారు. బాబు భుజంపై మోదీ చెయ్యి వేసి ఉత్సాహంగా మాట్లాడారు. ఇది టీడీపీ శ్రేణులకు ఎనలేని జోష్ తీసుకొచ్చింది. ఈ మీటింగ్ తర్వాత టీడీపీ మళ్లీ ఎన్డీయేలో చేరడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అయితే చంద్రబాబు – మోదీ మధ్య ఏం చర్చ జరిగిందనేది ఇంతవరకూ ఎవరికీ తెలీదు. అయితే వచ్చే పాతికేళ్లలో దేశంలో తీసుకురావల్సిన సంస్కరణలపై ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా చంద్రబాబును మోదీ కోరారని.. చంద్రబాబు ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారని ఈ మధ్య వార్తలు వినిపించాయి. త్వరలోనే ఈ నివేదికను చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి అందించే అవకాశం ఉందని సమాచారం.
ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీని ఎన్డీయేలో చేర్చుకోవడానికి రీజన్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు తమదేనని బీజేపీ నమ్మకంగా ఉంది. అంతేకాక.. మెజారిటీ రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. కచ్చితంగా ఇది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపును సునాయాసం చేస్తుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత సర్వేలను బట్టి.. ఇప్పుడున్న సీట్లతో పోల్చుకుంటే 70-80 సీట్లు తగ్గొచ్చని వాళ్లకు సమాచారం ఉంది. సీట్లు తగ్గినా కూడా మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమాగా ఉంది బీజేపీ అధిష్టానం. ఒకవేళ సీట్లు మరింత తగ్గితే అప్పుడు ఎలాంటి వ్యూహం అనుసరించాలనేది ఇప్పుడు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. తమతో కలిసి వచ్చే పార్టీలను ఎన్డీయేలో చేర్చుకోవడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటు మరింత సులువు అవుతుందని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా అవసరమైతే టీడీపీ లాంటి పార్టీలను కలుపుకునే అవకాశం ఉంటుంది.
కానీ టీడీపీ మాత్రం ఎన్డీయేలో కలవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బీజేపీ నుంచి పిలుపు అందితే ఏమాత్రం ఆలోచించకుండా.. ఎలాంటి షరతులు లేకుండా చేరిపోవడం ఖాయం. ఈసారి ఏపీలో తాము అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ ధీమాగా ఉంది. అదే సమయంలో కేంద్రంలో బీజేపీకి సీట్లు తగ్గితే తమ అవసరం కచ్చితంగా ఉంటుందని నమ్ముతోంది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ నుంచి టీడీపీకి ఆహ్వానం అందే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ఇప్పటికిప్పుడు జరుగుతాయని ఆశించలేం. ఎన్నికల నాటికి పొత్తులు, ఎత్తులు.. ఎలాంటి మలుపునైనా తీసుకునే అవకాశం ఉంది. వేచి చూద్దాం.. ఏం జరుగుతుందో!













