ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ కనెక్టివిటీ, సింగపూర్ ఎయిర్ లైన్స్ కీలక ప్రకటన..!
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన పనులను అత్యంత వేగంగా పూర్తి చేసి, జూన్ నెలాఖరు నాటికి విమానాశ్రయాన్ని సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెల్లడించారు. జూన్‌లో ఎయిర్‌పోర్టు పనులు ముగియనుండటంతో, జులై నుంచి ఇక్కడి నుంచి అధికారికంగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముందే అంతర్జాతీయ విమానయాన సంస్థలు భోగాపురం నుంచి సర్వీసులు నడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ (Singapore Airlines) అనుబంధ చౌక ధరల విమానయాన సంస్థ ‘స్కూట్’ (Scoot) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది జులై 8వ తేదీ నుంచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తమ విమాన సర్వీసులను నడుపుతామని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీనితో ఎయిర్‌పోర్టు ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఉత్తరాంధ్రకు సింగపూర్‌తో అంతర్జాతీయ కనెక్టివిటీ లభించనుంది.
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. విశాఖపట్నం ఐటీ, ఫార్మా రంగాలు మరింత వృద్ధి చెందడానికి, పర్యాటక రంగం విస్తరించడానికి ఈ ఎయిర్‌పోర్టు కీలక మైలురాయిగా మారనుంది. గడువులోగా పనులన్నీ పూర్తి చేసి జులైలో విమానాలను పరుగులు పెట్టించడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలను ముమ్మరం చేసింది. ఉత్తరాంధ్రలోని ఫార్మా, ఆక్వా, ఐటీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా ఇక్కడ ఒక భారీ అంతర్జాతీయ కార్గో టెర్మినల్ (Cargo Hub) ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కాగా ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో జీఎంఆర్ (GMR) విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. ఎయిర్పోర్ట్ మొదటి దశ పూర్తి కాగానే, ఇక్కడి నుంచి ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలా వసతులు కల్పిస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న రన్‌వే పొడవు సుమారు 3.8 కిలోమీటర్లు. దీనివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల విమానమైన ఎయిర్‌బస్ ఏ380 (Airbus A380) లాంటి జంబో జెట్ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అవ్వగలవు.







