ఏపీలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం శనివారం నాడు సరికొత్త బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడ(Vijayawada) వేదికగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ (Operation Clean Sweep) కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. మొత్తం నాలుగు వారాల పాటు నిరంతరాయంగా సాగనున్న ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కార్క్రమంలో భాగంగా మంత్రి నారాయణ స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగి పారిశుద్ధ్య కార్మికులను ఉత్సాహపరిచారు. విజయవాడలో నిర్వహించిన ప్రారంభోత్సవంలో ఆయన స్వయంగా చేతికి చీపురు పట్టి, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చారు. అంతేకాకుండా, రోడ్డు డివైడర్లకు రంగులు వేసే ప్రక్రియలో కూడా పాల్గొని ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా, స్వచ్ఛంద సంస్థలు (NGOs) మరియు సాధారణ ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
పరిశుభ్రత కార్యక్రమం ముగిసిన అనంతరం మంత్రి నారాయణ(Minister Narayana) స్థానిక ‘అన్న క్యాంటీన్’ను సందర్శించారు. అక్కడ క్యాంటీన్‌కు వచ్చిన సాధారణ ప్రజలతో కలిసి లైన్లో నిలబడి, వారితో పాటే కూర్చుని అల్పాహారం తీసుకున్నారు. అన్న క్యాంటీన్లలో అందుతున్న భోజనం, అల్పాహార నాణ్యతపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రతి శనివారం ఈ విధంగానే ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు.







