షూఆల్స్ సంస్థ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్‌తో మంత్రి లోకేష్ భేటీ
ఏపీలో షూఆల్స్ ఆర్ & డీ, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుచేయండి
ఆంధ్రప్రదేశ్‌లో పాదరక్షల యూనిట్ పనులు వేగవంతం చేయండి
సియోల్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ సంస్థ షూఆల్స్ (Shoealls) కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్ & సీఈవో లీ చియాంగ్-గెన్ (Mr. Lee Cheong-geun)తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… షూఆల్స్ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఎంవోయూ (MoU) మేరకు ఆంధ్రప్రదేశ్‌లో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగంగా ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రూ.300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆర్ & డీ (R&D), ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుచేసి, ఏపీని రిటైల్, డిస్ట్రిబ్యూషన్ హబ్‌గా మార్చాలని కోరారు. షూఆల్స్ సంస్థ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్ మాట్లాడుతూ… మాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్సార్ప్షన్, కూలింగ్ సోల్స్, యాంటీ బాక్టీరియల్ మెటీరియల్స్ ఏకీకరణతో MFDS-సర్టిఫైడ్ మెడికల్ ఫుట్‌వేర్ తయారీలో తమ సంస్థ ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌తో కలిసి AI స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఛైర్మన్ లీ చియాంగ్-గెన్ అన్నారు.








