హైదరాబాద్ మెట్రో భవిష్యత్తు మీ చేతుల్లోనే.. కేంద్ర పెద్దలతో మాట్లాడండి : సీఎం రేవంత్ రెడ్డి
కిషన్‌రెడ్డి గారూ… మెట్రోపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోండి
ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇవ్వాడానికి సహకరించండి
ఫేజ్-1ను తెలంగాణకు అప్పగించే ప్రక్రియ వేగవంతానికి కృషి చేయండి
ఆలస్యమైతే వేల కోట్ల అదనపు భారం పడే ప్రమాదమని ఆందోళన
హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ విషయంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఇకపై మరింత ఆలస్యం కాకుండా చూడాలని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలతో స్వయంగా మాట్లాడి, పెండింగ్‌లో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై శనివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న అంతర్జాతీయ నగరమని, పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్యలు, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్రో ఫేజ్-2 విస్తరణ అత్యవసరమని లేఖలో స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిపాలనా, ఆర్థిక ఆమోదం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ఆమోదించి, నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు అమలుకు సంబంధించి కేంద్రంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని లేఖలో గుర్తు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి… ఈ విషయంలో కిషన్‌రెడ్డి స్వయంగా ముందుండి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి, రైల్వే శాఖలతో నేరుగా చర్చించి, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ముందుకు తీసుకెళ్లాలని, హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన ఈ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జూన్ భేటీ నిర్ణయాలు ఇంకా అమలుకాలేదు
గత నెల జూన్ 23న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో, జూన్ 24 తేదీల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, తమరి సమక్షంలో జరిగిన కీలక సమావేశాలను సీఎం లేఖలో గుర్తు చేశారు. ఆ సమావేశాలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. ఆ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 బదిలీ, ఫేజ్-2 విస్తరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ఇప్పటి వరకు వాటిలో ఒక్కటీ అమలులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (ఎస్బీఐ క్యాప్స్)కు హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, ఆర్థిక పరిస్థితుల సమీక్ష, తెలంగాణ ప్రభుత్వానికి బదిలీకి అవసరమైన ఆర్థిక పరిశీలన బాధ్యతలు అప్పగించాలని అంగీకరించినట్లు సీఎం తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చే రీఫైనాన్సింగ్ అవకాశాలను కూడా ఎస్బీఐ క్యాప్స్ పరిశీలించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమవుతాయని సీఎం వివరించారు. అందుకే అదే సంస్థ ఫేజ్-2కు అవసరమైన ఆర్థిక నమూనా, దీర్ఘకాలిక రుణాల సమీకరణ, నిధుల సమీకరణ మార్గాలు, ప్రాజెక్టు అమలుకు అవసరమైన ఆర్థిక వ్యూహాన్ని రూపొందించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను వెంటనే ఖరారు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించిందని లేఖలో పేర్కొన్నారు.
ఎస్బీఐ క్యాప్స్ నియామకంలో జాప్యంపై ప్రత్యేక చొరవ తీసుకోండి
జూన్ లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఎస్బీఐ క్యాప్స్‌ను అధికారికంగా నియమించలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదన్నారు. దీంతో మెట్రో ఫేజ్-1 బదిలీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని, రోజువారీ నిర్వహణలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఎస్బీఐ క్యాప్స్ నియామకం ఆలస్యం కావడం వల్ల మెట్రో ఫేజ్-2 సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు కేంద్ర అనుమతులు కూడా ఆలస్యమవుతున్నాయని చెప్పారు. దీంతో నిధుల సమీకరణ ముందుకు సాగడం లేదని, ప్రాజెక్టు ప్రారంభం మరింత వాయిదా పడుతోందని తెలిపారు.
ఆలస్యమైతే వేల కోట్ల అదనపు భారం
మెట్రో ప్రాజెక్టు అమలులో ప్రతి నెల జాప్యం వల్ల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. ధరల పెరుగుదల, వడ్డీ భారం, నిర్మాణ సామగ్రి వ్యయం పెరగడం వంటి కారణాలతో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. అందుకే ఇకపై ఎలాంటి ఆలస్యం చేయకుండా అన్ని ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
హైదరాబాద్ అభివృద్ధికి మెట్రోనే వెన్నెముక
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని సీఎం వివరించారు. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ, విస్తరిస్తున్న నగర పరిధి, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్రో విస్తరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఫేజ్-1 తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ కాగా, ఫేజ్-2 వేగంగా అమలైతే నగర ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, హైదరాబాద్ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే చొరవ తీసుకుని సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలని, ఎస్బీఐ క్యాప్స్‌ను తక్షణమే నియమించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను ఖరారు చేయించాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలా జరిగితే మెట్రో ఫేజ్-1 బదిలీ ప్రక్రియ వేగంగా పూర్తవడంతో పాటు, ఫేజ్-2 విస్తరణ పనులు కూడా ఎలాంటి జాప్యం లేకుండా ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వంటి అంతర్జాతీయ నగర అభివృద్ధికి మెట్రో రైలు విస్తరణ అత్యంత కీలకమని, కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని సీఎం తన లేఖలో ప్రత్యేకంగా అభ్యర్థించారు.








