అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ తాజ్ కుమారుడు మహ్మద్ కుమేల్ షేక్ (Mohammad Kumel Shaikh) అమెరికాలో హఠాన్మరణం చెందడం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. గోల్డెన్ గేటు యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకుని కాన్వొకేషన్ అందుకున్న మొహమ్మద్ కుమేల్ షేక్ (28) గుండెపోటుతో మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన స్టాంప్ రైటర్ షేక్ తాజ్ కుమారుడు మొహమ్మద్ కుమేల్ షేక్ అమెరికా (America)లోని గోల్డెన్ గేటు యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. గురువారం రాత్రి కళాశాలలో కాన్వొకేషన్ అందుకుని ఇంటికి వెళ్లాడు. తెల్లారేసరికి గుండెపోటుతో మృతి చెందాడని అమెరికా నుంచి ఫోన్ వచ్చిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. చేతికొచ్చిన ఒకే ఒక్క కుమారుడు మృత్యువాత పడడంతో ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి.








