తిరుమల వేద పాఠశాలలో మరోసారి కరోనా కలకలం

తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా తాజాగా 10 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. పాఠశాలలో ఉంటున్న ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులకు కరోనా సోకినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని మెరుగైన చికిత్స కోసం పద్మావతి కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 10న వేదపాఠశాలలో 57 మంది విద్యార్థులకు కరోనా నిర్థారణ కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో వేదపాఠశాలలో కరోనా సోకిన వారి సంఖ్య 67కి చేరింది. ఈ వేద పాఠశాలలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన సుమారు 420 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు.