గల్లా జయదేవ్‌కు చంద్రబాబు కీలక బాధ్యతలు..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గల్లా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలంగా ఈ కుటుంబం రాజకీయాల్లో ఉంది. గల్లా జయదేవ్ ఇటీవలికాలం వరకూ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తల్లి గల్లా అరుణకుమారి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. ఆమె భర్త గల్లా రామచంద్ర నాయుడు పారిశ్రామిక వేత్తగా పేరొందారు. అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపకులుగా సుప్రసిద్ధులు. అరుణకుమారి నాన్న పాతూరి రాజగోపాల్ నాయుడు సీనియర్ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారు. ఈయనే చంద్రబాబును రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఇలా ఎంతో సుదీర్ఘ చరిత్ర ఈ కుటుంబానికి ఉంది. అయితే తాజా ఎన్నికల్లో ఈ కుటుంబానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
గల్లా కుటుంబం దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించింది. అయితే 2014 రాష్ట్ర విభజన సమయంలో గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ వేవ్ లో కూడా రెండోసారి గల్లా జయదేవ్ ఎంపీగా విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల నాటికి ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పారిశ్రామికంగా ఆయన అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. దీంతో రాజకీయాలు వదిలేయాలని నిర్ణయించుకుని గల్లా జయదేవ్ స్వచ్ఛంధంగా తప్పుకున్నారు.
అయితే గల్లా జయదేవ్ ఇప్పటికీ టీడీపీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి గల్లా జయదేవ్ ఆతిథ్యమిస్తున్నారు. ఆయన వెన్నంటే ఉంటున్నారు. దీంతో జయదేవ్ కు కీలక బాధ్యతలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నారనే సమాచారం ఢిల్లీలో జోరుగా వినిపిస్తోంది. ఆయన్ను రాజ్యసభకు పంపించి ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించ్చవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇందుకు గల్లా జయదేవ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవానికి గల్లా జయదేవ్ ను గుంటూరు నుంచి మళ్లీ పోటీ చేయాలని పార్టీ కోరినా ఆయన అంగీకరించలేదు. అయితే ఇప్పుడు ఆయన్ను రాజ్యసభకు పంపించేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలోని అమరరాజా కంపెనీకి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు రకాల అనుమతులు లేవంటూ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలని అధికారులు నోటీసులు పంపించారు. అయితే కోర్టులో ఊరట లభించడంతో గల్లా ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. దశాబ్దాలుగా తిరుపతి నుంచి వ్యాపారం చేస్తున్న గల్లా ఫ్యామిలీ తొలిసారి తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఏపీలో వైసీపీ అనుసరించిన విధానం వల్లే పెట్టుబడులను తెలంగాణకు తరలించినట్లు గల్లా ఫ్యామిలీ చెప్తోంది. అయితే చంద్రబాబు మాత్రం గల్లా ఫ్యామిలీని దూరం చేసుకునేందుకు సుముఖంగా లేరు. తగిన ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.













