నేడు పోలీసుల ముందుకు అంబటి రాంబాబు..!
మాజీ మంత్రి, వైసీపీ(YCP) సీనియర్ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu) చుట్టూ రాజకీయ సెగలు ముదురుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై(Chandrababu) అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో భాగంగా ఆయన నేడు కడప జిల్లాలో పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం తొలుత వేంపల్లి పోలీసుల ముందుకు, అనంతరం మధ్యాహ్నం పులివెందుల పోలీసుల ఎదుట అంబటి హాజరుకావాల్సి ఉంది. ఈ పరిణామం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఇవి కూడా చదవండి
గతంలో సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని టీడీపీ నేత రామమునిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు అంబటి రాంబాబుపై సెక్షన్ 352 (నేరపూరిత దాడి), 353 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం), 196 (1) (తప్పుడు సాక్ష్యాలు/సమాచారం) వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు సోషల్ మీడియా ఇన్ఛార్జ్లు, నేతలు పోలీసు విచారణ ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు అంబటి రాంబాబు వంతు వచ్చింది. వేంపల్లి పోలీసుల విచారణ ముగిసిన వెంటనే ఆయనను పులివెందులకు తరలించి అక్కడ కూడా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఈ విచారణ సందర్భంగా అంబటి నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం సేకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకే రోజు రెండు ప్రాంతాల్లో విచారణకు హాజరుకావాల్సి రావడంతో వైసీపీ కేడర్ అప్రమత్తమైంది.
మరోవైపు, అంబటి రాంబాబుపై నమోదు చేసిన కేసులను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపు చర్య అని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తున్న గొంతును నొక్కేందుకే కూటమి ప్రభుత్వం ఇటువంటి అక్రమ కేసులు పెడుతోందని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే, చట్టాన్ని అతిక్రమించి ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ విచారణ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి








