దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు : ఆజాద్
భారతదేశం తల నరికేశారని, జమ్మూకశ్మీర్ గుర్తింపు చెరిపేశారని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై ఎగువసభలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి కిరీటంలాఉన్న జమ్మూకశ్మీర్‌ను ముక్కలుగా నరికేస్తారని నేనసలు ఊహించనే లేదు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేశారు. ఇది సిగ్గు పడాల్సిన విషయం. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందిన రోజు దేశ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది. భారతదేశ పటం నుంచే జమ్మూకశ్మీర్‌ను తొలగించేలా రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొడుతున్నట్టు హోంమంత్రి (అమిత్ షా) ప్రకటించినప్పుడు సభలో అణుబాంబు పేలినట్టు అనిపించింది. చట్టం ద్వారా సమైక్యం చేయలేరు, అది మనసుల ద్వారానే సాధ్యం. మీకు దమ్ముంటే గుజరాత్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చండి. అధికార బలంతో రాష్ట్ర చరిత్రనే చెరిపేస్తున్నారు అన్నారు.













