మా మిస్టరీ వెపన్ వెరీ పవర్ ఫుల్.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక..!
పశ్చిమాసియా సంక్షోభం మరింత రగులుతోంది . హర్మూజ్ దీర్ఘకాలిక ముట్టడికి ట్రంప్ ప్రయత్నించడంపై ఇరాన్ భగ్గుమంటోంది. ఈ క్రమంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడనున్నట్లు తెలిపారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు.
దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే.. హర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ (Iran) చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) తిరస్కరించారు. ఈ క్రమంలో ఇరాన్ నుంచి తాజా హెచ్చరికలు వచ్చాయి. ‘అతిత్వరలో శత్రు బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తాం. అది వారిని తీవ్రంగా భయపెట్టనుంది. అది వారి పక్కనే ఉంది. దానితో వారికి గుండెపోటు కూడా రావొచ్చు’ అని షారమ్ ఇరానీ పేర్కొన్నారు. అయితే, ఆ ఆయుధం ఏంటి అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి
హర్మూజ్ (Strait of Hormuz)ను దిగ్బంధించి.. ఇరాన్‌ను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసి, చర్చలకు తీసుకురావాలనే అమెరికా వ్యూహాన్ని ఆయన కొట్టిపారేశారు. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్‌పై తమ దళాలు దాదాపు ఏడు క్షిపణులతో విరుచుకుపడ్డాయన్నారు. దీంతో అది కొన్ని రోజులు కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందన్నారు. అమెరికా దిగ్బంధనం ఉన్నప్పటికీ.. నౌకలు కొన్ని తమ ఓడరేవుల నుంచి వెళ్తున్నాయన్నారు. మరికొన్ని వాటి గమ్యస్థానాలకు కూడా చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈసందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ ప్రజల కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. శత్రువులు పశ్చాత్తాపం చెందేవరకు వారిని దెబ్బ కొడతామన్నారు.
మరోవైపు… ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని అధ్యక్షుడు ట్రంప్ (Trump) తాజాగా స్పష్టం చేశారు. దిగ్బంధనాన్ని ఎత్తివేయాలనే ఇరాన్ ప్రతిపాదనపై రాజీపడే ప్రసక్తే లేదని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సైనిక చర్యతో పోలిస్తే.. ఓడరేవుల దిగ్బంధనమే ప్రభావవంతంగా పనిచేస్తోందని, దీంతో టెహ్రాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోందన్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, చర్చలకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందన్నారు. సంఘర్షణను ముగించాలని వారు కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి








