విజయ్ తో పొత్తు వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏమిటంటే..
తమిళనాడులో విజయ్ పార్టీకి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. చెన్నైలోని టీవీకే కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం అందించేందుకు ముందుకు రాగా.. వారి నిర్ణయాన్నివిజయ్ స్వాగతించారు. మరోవైపు విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి అంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
విజయ్ తో పొత్తు ఖరారైన నేపథ్యంలో తన పాత మిత్రుడు డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు విచ్ఛిన్నమైనట్లే. సుదీర్ఘ బంధానికి తెరపడింది. అయితే.. కాంగ్రెస్ విజయ్ కి మద్దతివ్వడం వెనుక రాజకీయం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు.
అయితే.. మొదట్లో విజయ్ కి అన్నాడీఎంకే మద్దతిచ్చేందుకు రెడీ అయ్యిందని వార్తలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. అన్నా డీఎంకేను రాజకీయంగా నివారించడానికే కాంగ్రెస్ తన స్నేహ హస్తం చాటింది. ఇప్పటికే అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తులో వుంది. ఒకవేళ అన్నాడీఎంకే, విజయ్ మధ్య పొత్తు కుదిరితే మాత్రం బీజేపీ తమిళనాడులో బాగా లాభపడినట్లే. రాజకీయంగా పాతుకుపోయినట్లే. దీనిని నివారించేందుకే కాంగ్రెస్ ఈ పాచిక వేసింది.
విజయ్‌కు తమ మద్దతును అందించడానికి కాంగ్రెస్ కొన్ని షరతులను కూడా విధించింది. ఇందులో ఒక కీలక షరతు ఏమిటంటే, TVK ఎట్టి పరిస్థితుల్లోనూ NDAతో గానీ, దాని భాగస్వామ్య పక్షాలతో గానీ—ముఖ్యంగా AIADMKతో—కూటమిని ఏర్పాటు చేయకూడదని షరతు పెట్టింది. విజయ్ అసలు బీజేపీ మొహమే చూడొద్దని అన్యాపదేశంగా చెప్పినట్లు. అయితే.. బయటి నుంచి మద్దతు కాకుండా, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. నిజానికి తమిళనాడులోని ఏ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీలను నేరుగా తమ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయలేదు. చాలా జాగ్రత్తగా డీల్ చేశాయి.
కాంగ్రెస్ నుండి వస్తున్న ఈ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, TVK ఒక కొత్త ఎత్తుగడ వేసింది. విజయ్ తరపున, AIADMK మరియు దాని మిత్రపక్షమైన PMK మద్దతును కూడా కోరింది. అంతేకాకుండా అన్నాడీఎంకేతో విజయ్ పూర్తిగా తెగతెంపులు కూడా చేసుకోలేదు. కాస్త ద్వారాలను అటు కూడా తెరిచే వుంచారు. ఎందుకంటే, కాంగ్రెస్ చేతిలో ఉన్న ఐదు స్థానాలే కాకుండా, మెజారిటీని సాధించడానికి విజయ్‌కు ఇంకా అదనంగా ఐదు స్థానాలు అవసరం. TVK నాయకుడు N. ఆనంద్, AIADMK అధినేత E.K. పళనిస్వామిని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో విజయ్ చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ తో పొత్తుకు తెర లేపారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి








