మలేషియాలో అక్రమ వలసదారులకు భారీ ఊరట.. క్షమాభిక్ష పథకం 2027 వరకు పొడిగింపు!
PRM 2.0: మలేషియాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు తమ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకుని స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్’ (PRM) 2.0 గడువును 2027 మే 31 వరకు అధికారికంగా పొడిగించింది. ఇమ్మిగ్రేషన్ మలేషియా డైరెక్టర్ జనరల్ దాతో జకారియా షాబాన్ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో ఈ గడువు 2026 ఏప్రిల్ 30తో ముగియాల్సి ఉండగా, భారీ స్పందన కారణంగా మరో ఏడాది పొడిగించారు.
పథకం గణాంకాలు , ప్రయోజనాలు..
2025 మే 19 నుండి 2026 ఏప్రిల్ 29 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 112 దేశాలకు చెందిన 2.54 లక్షలకు పైగా వలసదారులు నమోదయ్యారు. ఈ ప్రక్రియ ద్వారా జరిమానాల రూపంలో ప్రభుత్వానికి RM 127 మిలియన్ (సుమారు ₹300 కోట్లు) ఆదాయం సమకూరింది. డాక్యుమెంట్లు లేని వారు లేదా వీసా గడువు ముగిసి (ఓవర్‌స్టే) ఉంటున్న వారు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఈ పథకం ద్వారా స్వదేశం వెళ్ళవచ్చు.
ఇవి కూడా చదవండి
తెలుగు కార్మికుల పరిస్థితి ..
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణకు చెందిన అనేకమంది కార్మికులు ఏజెంట్ల చేతిలో మోసపోయి, విజిట్ వీసాలపై మలేషియాకు వచ్చి అక్రమంగా నివసిస్తున్నారు. వీరు ప్రధానంగా పామ్ ఆయిల్, రబ్బర్ తోటలు, కన్స్ట్రక్షన్ , హోటల్ రంగాల్లో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫెడరేషన్ ఆఫ్ NRI కల్చరల్ అసోసియేషన్స్ (FNCA) మలేషియా ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి అక్రమంగా ఉంటున్న తెలుగు వారు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.
స్వదేశం వెళ్లాలనుకునే వారు పాటించాల్సిన నిబంధనలు..
ఈ పథకం కింద కేవలం 500 మలేషియా రింగ్గిట్ (సుమారు రూ. 10,000) చెల్లించి స్వదేశం వెళ్ళవచ్చు.
పాస్‌పోర్టు ఉన్నవారు వారం రోజుల్లో ప్రయాణించేలా విమాన టికెట్ సిద్ధం చేసుకోవాలి.
పాస్‌పోర్టు లేని వారు ఇండియన్ హై కమిషన్ నుండి ‘ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికేట్’ పొందాలి.
అప్లికేషన్ ప్రక్రియలో సహాయం కోసం FNCA-మలేషియా, తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా , మలేషియా ఆంధ్రా అసోసియేషన్లను సంప్రదించవచ్చు.
పథకం పొడిగించినప్పటికీ, అక్రమ వలసదారులు , వారిని ఉంచుకునే యజమానులపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








