అస్సాం ఎన్నికల ఫలితాల ట్రెండ్స్.. అధికారం దిశగా ఎన్డీయే కూటమి
అస్సాం రాష్ట్రంలో అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 126 స్థానాలు ఉన్న ఈ అసెంబ్లీలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మే 4, 2026 ఉదయం 9:30 గంటల వరకు వెలువడిన ప్రాథమిక ఫలితాల సరళిని పరిశీలిస్తే, అధికార పక్షమైన ఎన్డీఏ (NDA) తన పట్టును నిలబెట్టుకుంటూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు, ఎన్డీఏ కూటమి 23 స్థానాల్లో ముందంజలో ఉంది. అదే సమయంలో, కాంగ్రెస్ (CONG) పార్టీ 3 స్థానాల్లో, ఏఐయూడీఎఫ్ (AIUDF) 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 64 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. ఎన్డీఏ కూటమి వరుసగా మూడవసారి అధికారాన్ని నిలబెట్టుకుని రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకోగా, పదేళ్ల తర్వాత మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ‘అసోమ్ సమ్మిలితో మోర్చా’ (ASM) కూటమి గట్టి ప్రయత్నం చేస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 40 కేంద్రాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో, అస్సాం రాజకీయ ముఖచిత్రం ఏ విధంగా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నిమిషం నిమిషానికి మారుతున్న ట్రెండ్స్ పట్ల రాజకీయ విశ్లేషకులు ఓటర్లు ఉత్కంఠగా గమనిస్తున్నారు. మధ్యాహ్నం సమయానికి ఫలితాల్లో మరిన్ని కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎన్డీయే కూటమి విజయం దాదాపు కన్ఫార్మ్ అయినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు.








