ఒక్క రోజులో 40 వేల కేసులు..
జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం అమెరికాలో గురువారం ఒక్క రోజే 40 వేలకు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఒక రోజు కేసుల్లో ఇతే అత్యధికం. లాక్డౌన్ సడలింపు అనే తప్పుడు నిర్ణయంతోనే అమెరికాలో కరోనా విజృంభిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఏప్రిల్ 24న 36,400 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు కేసుల్లో ఇదే అత్యధికం. గురువారం దాన్ని అధిగమించింది. అలాగే ఏప్రిల్ మధ్య రోజుల్లో రోజుకు 2,200 మంది కరోనాతో మృతి చెందేవారు. రోజువారీ మరణాల్లో సంఖ్యలో దాన్ని కూడా అధిగమించే అకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో రోజుకు సుమారు 600 మంది కరోనాతో మృతి చెందుతున్నారు.
జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో కరోనా మొత్తం మరణాలు సంఖ్య 1 లక్షా 25 వేలుకు దగ్గరగా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 25 లక్షలకు సమీపంగా ఉంది. అరిజోనా, టెక్సాస్, ఫ్లోరిడాతో పాటు మొత్తం 29 రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ విజృంభణ నేపధ్యంలో టెక్సాస్, అరిజోనా రాష్ట్రాలు తమ సరిహద్దులను మళ్లీ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇలాంటి చర్యలు సరిపోవని, వైరస్ను అడ్డుకోవాలంటే వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. కనీసం రోజుకు 5 లక్షల పరీక్షలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.






