అర్జెంటీనాలో లక్ష దాటిన కరోనా కేసులు
అర్జెంటీనాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ఆ దేశంలో పాజిటివ్ కేసులు లక్షకు మించినట్లు ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 2,657 కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 1,00,116కు చేరింది. 700 మందికిపైగా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు 1,845 మంది మృత్యువాతపడ్డారు. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో అర్జెంటీనా రాజధాని బ్రూనస్ ఎయిర్స్లో లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేశారు.
జులై 1 నుంచి 17 వరకు కొత్త లాక్డౌన్ నిబంధనలు విధిస్తూ ఆ దేశ ప్రధాని ఆల్బర్టో ఫెర్నాండేజ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రయాణ నిబంధనలను సైతం అర్జెంటీనా ప్రభుత్వం కఠినతరం చేసింది. సెప్టెంబర్ 1 వరకు అన్ని వాణిజ్య విమానాలను రద్దు చేసింది. అర్జెంటీనా పొరుగు దేశమైన బ్రెజిల్లో మరింత ఆద్వానంగా ఉంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 1.8 మిలియన్ల మంది కరోనా బారినపడగా మృతుల సంఖ్య ఏకంగా 72వేలకు చేరింది. ప్రపంచంలో అమెరికా తరువాత కరోనా కల్లోలం బ్రెజిల్లోనే అధికంగా ఉంది.






