కొత్త రూపాలలో మహమ్మారి!

వాషింగ్టన్‍ః కరోనా మహమ్మారిని నిరోధించడానికి, నివారించడానికి ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా, అది కొత్త రూపాలలో విజృంభిస్తూనే ఉందని ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ ఫాసీ ఆంటొనీ వంటి ఉన్నత స్థాయి ఆరోగ్య శాఖాధికారులు ఈ కొత్త రూపాల విస్తరణ గురించి రాష్ట్రాల ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నప్పటికీ ఆ ప్రభుత్వాలు క్రమక్రమంగా ఆంక్షలు, నిషేధాలు తొలగిస్తూండడం జరుగుతోంది. అమెరికాలో ఈ వైరస్ నిరోధానికి జో బైడెన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక పకడ్బందీ చర్యలను చేపట్టింది. వంద రోజుల్లో వైరస్ కేసుల సంఖ్యను బాగా తగ్గించాలని, మరణాల రేటును దాదాపు జీరోకు తీసుకు రావాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే, వైరస్ విస్తరణ వేగంలో మార్పు రాలేదు. బ్రిటన్, దక్షిణాఫ్రికా, చైనా తదితర దేశాల నుంచి కొత్త రూపాలలో అమెరికాలో ప్రవేశించిన కరోనా వైరస్ మాత్రం మరణాల సంఖ్యను, కేసుల సంఖ్యను పెంచుతూనే ఉందని డాక్టర్ ఫాసీ ఆంటొనీ ఆందోళన వ్యక్తం చేశారు.
అరిజోనా, కాలిఫోర్నియా, సౌత్ కరోలినా రాష్ట్రాలలో రెండు రోజుల క్రితం అనేక ఆంక్షలను, నిషేధాలను తొలగించారు. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించవచ్చంటూ ఆంక్షలు ఎత్తేసిన అరిజోనా గవర్నర్ ఆ సంస్థలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీచేశారు. కాగా, ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదంటూ సౌత్ కరోలినా రిపబ్లికన్ గవర్నర్ పూర్తిగా ఆంక్షలు రద్దు చేశారు. రెస్టారెంట్లలో మాత్రం మాస్కులను ధరించడం తప్పనిసరి చేశారు.
ఇది ఇలా ఉండగా, కాలిఫోర్నియాలో ఏప్రిల్ 1 నుంచి పార్కులు, స్టేడియంలను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మాత్రం షరతు విధించింది. ‘‘ఈ రాష్ట్రాలలోనే కాక, దేశ వ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క శుక్రవారం రోజునే 60,000 నుంచి 70,000ల వరకు కొత్తగా కేసులు నమోదయ్యాయి’’ అని ఫాసీ వెల్లడించారు. ‘‘ఇలా కేసులు పెరగడాన్ని బట్టి దేశంలో ఈ వైరస్ కొత్త రూపాలలో ప్రవేశిస్తోందేమోనన్న అనుమానం కలుగుతోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
శుక్రవారం వరకు వారం రోజుల వ్యవధిలో సగటు కేసుల సంఖ్య 61,000 వరకూ ఉంటోందని ఆరోగ్య నిపుణుల అంచనా. కరోనా వైరస్ ప్రారంభమయిన మొదటి రోజుల్లో కూడా ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాలేదని వారు భావిస్తున్నారు. ఇటీవలి వరకూ ఐరోపా దేశాలు ఎదుర్కొన్న విధంగానే అమెరికా కూడా ఈ వైరస్ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఫాసీ భయాందోళనలు వ్యక్తం చేశారు. గత వారం రోజుల్లో కేసుల సంఖ్య సాధారణ సగటు కన్నా 9 శాతం పెరిగినట్టు ఫాసీ చెప్పారు.