తెలంగాణలో 32 వేలు దాటిన కేసులు
తెలంగాణలో మొదటిసారిగా ఒకే రోజు 10వేలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇందులో 762 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో కాగా, రంగారెడ్డిలో 171, మేడ్చల్ 85, సంగారెడ్డి 36, ఇతర ప్రాంతాల్లో మిగతా కేసులు నమోదైనట్లు పేర్కొంది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32,224కి చేరింది. కరోనాతో ఇవాళ 8 మంది మృతిచెందాగా ఇప్పటి వరకు 339 మంది మృత్యువాతపడ్డారు. ఇవాళ కరోనా నుంచి 1,013 మంది కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం 19,205 మంది డిశ్చార్జి అయ్యారు. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 12,680 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఒక్క రోజే రాష్ట్రంలో 10,354 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 60 శాతం డిశ్చార్జి కాగా, 39 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా, ఒక శాతం మరణాలు నమోదైనట్లు పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల్లో 83 శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ లేవని, కేవలం నాలుగు శాతం మందిలోనే తీవ్ర లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.






