అమెరికా మాదిరిగా పెరుగుతున్న కేసులు
దేశంలో కొవిడ్ మహమ్మారి ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందో ఈ లెక్కలే చెబుతున్నాయి. కరోనా కేసులు గురువారం 12,881, శుక్రవారం 13,586.. కేసుల సంఖ్యలో ఏరోజు కారోజే కొత్త రికార్డు నమోదవుతోంది. కేవలం రెండు రోజుల్లోనే పాతిక వేలకు పైగా నమోదయ్యాయి. వరుసగా 8వ రోజు 10 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. కరోనా వ్యాప్తి క్రమేపి అమెరికాలో మాదిరిగా పెరుగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంతవరకు మొత్తం 3.80 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో మహారాష్ట్ర (3,752), ఢిల్లీ (2,877)లో అత్యధిక కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 336 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో దాదాపు సగం మంది మహారాష్ట్ర, ఢిల్లీలోనే చనిపోయారు.













