ఏపీలో 3,963 కొత్త కేసులు… 52 మరణాలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా 3,963 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకే రోజు ఇంత ఎక్కువ మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 44,609కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 52 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు 589 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. తూర్పు గోదావరిలో 12 మంది, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 8, అనంతపురంలో 7, పశ్చిమగోదావరిలో 5, ప్రకాశంలో 4, నెల్లూరులో 3, విశాఖలో 2, చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వివిధ ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో 22,260 మంది చికిత్స పొందుతుండగా 21,763 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12.84 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పింది.






