ఏపీలో 1813 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1813 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రంలోని వారు 1775 మంది ఉండగా, ఇతర రాష్ట్రాలోని వారు 34 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు మరో నలుగురు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 27,235కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో 17 మంది మృతి చెందారు. మృతుల్లో కర్నూలు జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు ఉండగా.. అనంతపురం, కడప, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 14,393 మంది కోలుకోగా, 12,533 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.






