ఏపీలో అత్యధికంగా 796 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,458 మంది నమూనాలు పరీక్షించగా 796 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన అయిదు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 51 కేసులు ఉండగా, రాష్ట్రంలో 740 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 12,285 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 157 చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5480కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 6648 మంది చికిత్స పొందుతున్నారు.













