ఏపీలో 40 వేలు దాటిన కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో రోజుకు రెండు వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 2602 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. వీరిలో ఇతర రాష్ట్రాల్లోని వారు 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 40,646కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 42 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 534కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20298 మంది డిశ్చార్జి కాగా, 19,814 మంది చికిత్స పొందుతున్నారు.






