తెలుగు రాష్ట్రాల్లో తగ్గని కరోనా వేగం…
దేశంలోనూ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి చోట్ల బాగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నట్లే కనిపిస్తోంది. మరోవైపు ప్రజలు కూడా ఈ కరోనా మహమ్మారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా కేసులు పెరగడానికి కారణమవుతోంది.
లాక్డౌన్ నిబంధనలను ఎత్తివేసిన అనంతరం దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరిగింది. ఒక్క జూన్ నెలలోనే నాలుగు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయంటే వైరస్ విజ•ంభణ ఏ విధంగా ఉందో తాజా గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. దేశంలో జనవరి 31న తొలి కరోనా కేసు నమోదైనా.. మార్చినాటికి అంతగా వ్యాప్తి చెందలేదు. లాక్డౌన్ విధింపు, భౌతిక దూరం పాటించడంతో వైరస్‌ను కట్టడిచేశామనే భావన తొలుత అందరిలోనూ కలిగింది. అయితే మే మూడో వారం నుంచి పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. మార్చిలో విధించిన లాక్‌డౌన్‌కు మే నాటికి విడతల వారీగా సడలించడం, శ్రామిక్ రైళ్లు ప్రారంభించడం, వలస కూలీల తరలింపు వంటి నిర్ణయాలతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగింది.
కేంద్ర గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో మొత్తం 33,248 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య మే మాసంలో 1,50,195గా పెరిగింది. ఇక జూన్ నెల ముగిసే నాటికి దేశంలో కరోనా వైరస్ జూలు విదిల్చింది. ఒక్క నెలలోనే ఏకంగా నాలుగు లక్షలకు పైగా (4,00,414) కరోనా కేసులు నిర్ధారణ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక మరణాల సంఖ్యా అదే రీతిలో పెరుగుతోంది. ఏప్రిల్‌లో 1105 మరణాలు సంభవించగా.. మే లో 4267, జూన్‌లో 11,988 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. తాజా గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరణాల సంఖ్య 5,85,493కి చేరగా.. మరణాల సంఖ్య 17,400కి పెరిగింది. మే చివరినాటికి లాక్డౌన్ నిబంధనాలు పూర్తిగా ఎత్తివేయడంతో వ్యక్తిగత, సామాజిక వ్యవహార శైలిలో జనజీవనం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదివరకే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
వైరస్ తొలినాళ్లలో ప్రజలు చూపిన జాగ్రత్తలు, భౌతిక దూరం నిబంధనలు ఇప్పుడు పాటించడంలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని, కంటైన్మెంట్ జోన్లలో మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ప్రధాని సూచించారు. మరోవైపు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులోనే అత్యధిక భాగం నమోదవడం ఆందోళనకరమైన అంశం. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫ్లాస్మా థెరపీ చికిత్సతో మొదట్లో కొంత కుదుటపడ్డా.. పెరుగుతున్న కేసులతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కరోనా తమిళనాడు వాసులకు కంటిమీదు కనుకులేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 90,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1201 మంది మృత్యువాత పడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో…
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడంలేదు. పసిపిల్లల నుంచి పండు ముసలివరకూ ఏ ఒక్కరినీ వదలడంలేదు. ఒక్కరి నిర్లక్ష్యంతో కుటుంబమంతా వైరస్ బారిన పడాల్సి వస్తున్నది. దీంతో కరోనా కట్టడికి లాక్డౌన్ ఒక్కటే మార్గమని గ్రహించిన పలువురు వ్యాపారులు మార్కెట్లకు స్వచ్ఛందంగా తాళం వేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే బేగంబజార్, సికింద్రాబాద్, రాణిగంజ్ మార్కెట్లు మూతపడగా బార్బర్ షాపులు సైతం స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నట్లు ప్రకటించాయి. జూన్ 10 నుంచి 30 వరకు జీహెచ్ఎంసీలో 10,170 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 907, మేడ్చల్‌లో 482 వచ్చాయి. మొత్తం 11,559మందికి పాజిటివ్ వచ్చింది. పెరుగుతున్న కోవిడ్19 పాజిటివ్ కేసులతో జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలను కరోనా భూతం వెంటాడుతోంది.
కాగా కరోనా టెస్ట్‌ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై అన్నీ వర్గాలు విమర్శలు కురిపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. చివరకు హైకోర్టు కూడా ఈ విషయంలో అక్షింతలు వేసినా రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్‌లు జరిపించడంలో మాత్రం పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. మొదట్లోనే టెస్టింగ్ పక్రియను వేగంగా జరిపి ఉంటే ఇప్పటికే కరోనా అదుపులో వచ్చేదని పలువురు చెబుతున్నారు. ఇప్పుడు అంతటా వ్యాపించాక ఇప్పటికైనా టెస్ట్‌ల విషయంలో ప్రభుత్వం ముందుకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆంధప్రదేశ్‌లో…
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ టెస్ట్‌లు చేస్తుండటంతో రాష్ట్రంలో రోజురోజుకు పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకన్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరోనా కోరలు చాస్తోంది. కరోనా పరీక్షలు 9 లక్షలకు చేరువయ్యాయి. జూలై 1 నాటికి టెస్ట్‌ల సంఖ్య 9 లక్షలు దాటింది. రోజుకు కేవలం 90 పరీక్షలతో మొదలై.. ఇప్పుడు రోజుకు 30 వేల టెస్ట్‌లు చేస్తున్న రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఆంధప్రదేశ్ గుర్తింపు పొందింది.
ఐదు వారాల వ్యవధిలోనే కేసులు 400 శాతం పెరిగాయి. అనేక జిల్లాల్లో కేసుల సంఖ్య వందల నుంచి వేలకు చేరింది. కర్నూలు (1873), అనంతపురం (1467), క•ష్ణా (1383), గుంటూరు (1291), తూర్పుగోదావరి (1074) జిల్లాలు ఇప్పటికే వెయ్యి కేసుల రికార్డు స•ష్టించాయి. పశ్చిమగోదావరి (988), చిత్తూరు (947), కడప (865) జిల్లాలు ఆ బాటలోనే పయనిస్తున్నాయి. కర్నూలులో ప్రతిరోజూ 70 కేసులకు తక్కువ కాకుండా వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం నాటికి ఈ జిల్లా రెండు వేల మార్కుని దాటేస్తుంది. అనంతపురం జిల్లాలో ఆరు రోజుల వ్యవధిలో సుమారు 800 కేసులు నమోదయ్యాయి. జూలై 15 నాటికి దాదాపు అన్ని జిల్లాల్లోనూ వెయ్యి కేసులు నమోదవుతాయని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కరోనా కాఠిన్యానికి కర్నూలు, క•ష్ణా జిల్లాలు మరింతగా తల్లడిల్లుతున్నాయి. ఓ పక్క పాజిటివ్ కేసులు, మరోపక్క మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధిక కరోనా మ•తులు ఈ జిల్లాల వారే. రోజువారీ నమోదవుతున్న మరణాలూ ఇక్కడే అధికం. ఈ రెండు చోట్లా కరోనా మరణాల రేటు జాతీయ సగటును మించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
మరోపక్క అనంతపురం, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఆయా చోట్ల కరోనా రోగుల్లోనూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారు. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాల్లో సంఖ్యాపరంగా కర్నూలు జిల్లా రాష్ట్రంలో తొలి స్థానంలో కొనసాగుతోంది. మొదట్లో దిల్లీ నుంచి వచ్చినవారి వల్ల, ఆ తర్వాత చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లివచ్చిన వారి వల్ల వైరస్ వ్యాపించింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల వల్ల అత్యధిక కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగరంతో పాటు, ఆదోని, నంద్యాల పట్టణాల్లో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి. మరణాల్లో సగానికిపైగా కర్నూలు నగరానివే. ఇతర చోట్ల కూడా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. చిత్తూరులో కూడా కేసుల సంఖ్య బాగానే పెరుగుతోంది. కాగా కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పలువురు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.






