అగ్రరాజ్యంలో 2 కోట్ల మందికి కరోనా?
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి ఉద్ధ•తి కొసాగుతోంది. వైరస్ పూర్తిగా కట్టడి కాకముందే లాక్డౌన్ ఎత్తివేయడంతో వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. దేశంలోకి వైరస్ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 కోట్ల మంది అమెరికన్లకు వైరస్ సోకి ఉంటుందని ఆ దేశ వైద్యాధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకూ నమోదైన 23 లక్షల కేసులుకన్నా ఇది పది రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. లక్షలాది మంది తెలియకుండానే వైరస్ బారినపడుతున్నారని, టెస్టింగ్‌లో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల చాలా కేసులు లెక్కలోకి రావవట్లేదని చెప్పారు. 20 మిలియన్ల మందికి కరోనా సోకిందంటే అమెరికా జనాభా (331 మిలియన్లు)తో 6శాతం వైరస్ బారినపడ్డట్లేనని వివరించారు.
దేశంలో చాలా మంది ఇప్పటికీ వైరస్ బారిన పడుతున్నారని సృష్టమైందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రీవెన్షన్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ తెలిపారు. కొత్తగా నిర్ధారణ అయిన ప్రతీ కరోనా కేసుకు అదనంగా మరో 10 మందికి వైరస్ సోకి ఉంటుందని అంటువ్యాధులు నిపుణుడు డాక్టర్ ఆంటోనీ పేర్కొన్నారు. కరోనా సోకినవారిలో 25 శాతం మందికి వైరస్ లక్షణాలే లేవని ఆయన చెప్పారు.






