కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ అమెరికాను దాటొచ్చు!
కరోనా పాజిటివ్ కేసుల్లో భారతదేశం అమెరికాను దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆ దేశానికి చెందిన యేల్ స్కూల్ ఆఫ్ మెడిసన్ శాస్త్రవేత్త మనీషా జుతానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో 21 లక్షల కేసులు నమోదయ్యాయి. మనదేశంలో సోమవారానికి నమోదైన కేసుల సంఖ్య 3,32,424కు చేరుకున్నది. మూడు రోజులుగా దేశంలో సగటున 11 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనీషా జుతానీ తన అంచనాలను వెలువరించారు. ఈ ఏడాది చివరి దాకా భారత్లో కేసుల పెరుగుదల నమోదవుతూనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రత తగ్గేలోపు ఇండియాలో కేసులు అమెరికాను దాటేస్తాయన్నారు. ఐసీఎమ్మార్ చేసిన ఓ అధ్యయనం మనీషా అంచనాలను సమర్థించే విధంగా ఉంది.
దేశంలో నవంబర్ నాటికి కరోనా కేసులు గరిష్టస్థాయికి చేరుకొంటాయని ఐసీఎమ్మార్ ఏర్పాటు చేసిన ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ అధ్యయనం వెల్లడించింది. లాక్డౌన్ వల్ల దేశంలో కేసుల పెరుగుదల నెమ్మదించిందని, కేసులు పీక్ స్టేజీకి చేరే సమయం 34-76 రోజులకు పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కట్టుదిట్టమైన ఆంక్షల కారణంగానే దేశంలో కరోనా కేసుల 83 శాతం తక్కువగా నమోదయ్యాయని సృష్టం చేశారు. అయితే, కరోనా విజృంభణ నేపథ్యంలో నవంబర్ నెలలో కరోనా కేసులు పీక్ స్టేజికి చేరుకుంటాయని, ఆ నెల మధ్యకు దవాఖానాలు నిండిపోయి బెడ్లు దొరకని పరి్థ••తి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నివారణకు దేశ జీడీపీలో 4.5 శాతం ఖర్చు కావొచ్చని ఈ నివేదికలో అంచనా వేశారు.






