డొనాల్డ్ ట్రంప్ అలా అనలేదు… వైట్‌హౌస్
చైనాపై వాణిజ్య యుద్ధంలో సుంకాలు తాను మరింత పెంచనందుకే ట్రంప్ విచారం వ్యక్తం చేశారని అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. ట్రంప్ మాటలను మీడియా పూర్తిగా వక్రీకరించిందని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్ తెలిపారు. చైనాతో వాణిజ్య యుద్ధంపై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయో అని అడిగినప్పుడు వాణిజ్యం యుద్ధంపై తాను రెండో ఆలోచనలో ఉన్నట్లు ట్రంప్ చెప్పారని, ఆయన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని స్టెఫానీ అన్నారు. చైనాపై వాణిజ్య సుంకాలు మరింత పెంచనందుకే తాను చింతిస్తున్నానని ట్రంప్ సృష్టంగా చెప్పారని గ్రిషమ్ విడుదల చేసిన లిఖిత పూర్వక ప్రకటనలో తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు తన దుందుడుకు వాణిజ్య యుద్ధం గురించి మిత్ర పక్షాలను అసలు సంప్రదించనే లేదు. ఈ విషయంలో బ్రిటన్ ప్రధాని ట్రంప్‌ను సుతిమెత్తగా విమర్శించారు. వాణిజ్య శాంతినే బ్రిటన్ కోరుకుంటోందని, సుంకాల కన్నా స్వేచ్ఛా వాణిజ్యానికే తాము అనుకూలమని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు.













